4 లైన్లు.. 14 ఏళ్లు..!

Feb 5,2024 23:09

ప్రజాశక్తి-తెనాలి : ప్రధాన రోడ్లు చిద్రమైపోయాయి. నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో ఏ ఒక్క రోడ్డుకూడా మరమ్మతులకుగాని, నిర్మాణానికి గాని నోచుకోలేదంటే అతిశయోక్తి కాదేమో. దీనికి తోడు ఎంతో ప్రాధాన్యత కలిగిన నాలుగులైన్ల రోడ్డు పూర్తి చేసేందుకు అధికారులకుగాని, ప్రజాప్రతినిధులకు గాని మనసు రాలేదు. తెనాలి-మంగళగిరికి రోడ్డు బ్రహ్మాండంగా నిర్మిస్తామని హమీ ఇచ్చిన ఎమ్మెల్యే కొత్తగా రోడ్డు నిర్మించపోతే మానే… కనీసం గత ప్రభుత్వాల్లో నిర్మాణం చేపట్టిన నాలుగు లైన్న రోడ్డు కూడా పూర్తిచేయలేకపోయారు. దుర్భరంగా ఉన్న రోడ్లతో జనం అవస్థ పడుతున్నా ప్రభుత్వా నికి చీమకుట్టినట్టయినా లేదు. నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి గ్రహణం వీడటంలేదు.

దాదాపు 14 ఏళ్ల క్రితం తెనాలి-చందోలు మార్గంలో పెదరావూరు నుంచి ఆటోనగర్‌ వరకూ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ హయాంలో ప్రారంభించిన రోడ్డు నిర్మాణంలో భాగంగా పెదరావూరు నుంచి తెనాలి ఆర్టీసీ బస్టాండ్‌ వరకూ తూర్పు, పడమర కాల్వలకు రీటెయినింగ్‌ వాల్స్‌ నిర్మించి, రోడ్డు నిర్మాణం మాత్రం వైకుఠపురం వరకూ పూర్తి చేయగలిగారు. అక్కడి నుంచి బస్టాండ్‌ వరకూ కొంత మేర నిర్మాణం సాగింది. ఈలోగా 2014 ఎన్నికలు రావటంతో తదుపరి టిడిపి అధికారంలోకి రావటం, ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అంచనాలను పెంపు చేసి, దాదాపు విస్సార్‌ కళాశాల వరకూ రీటెయినింగ్‌ వాల్స్‌, రోడ్డు నిర్మాణాన్ని, పూర్తి చేశారు. అక్కడి నుంచి తెనాలి విజయవాడ మార్గంలో ఎడమవైపు రోడ్డును కఠెవరం వరకూ పూర్తి చేశారు. కాగా కుడివైపు రోడ్డు నిర్మాణం, రీటెయినింగ్‌ వాల్స్‌ నిర్మాణం నిలిచిపోయింది. 2019లో వైసిపి అధికారంలోకి రాగా ఎమ్మెల్యేగా అన్నాబత్తుని శివకుమార్‌ గెలుపొందారు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో కఠెవరం నుంచి ఆటోనగర్‌ వరకూ ఎడమవైపు రోడ్డును మాత్రం పూర్తి చేయగలిగారు. విస్సార్‌ కళాశాల నుంచి ఆటోనగర్‌ వరకూ డివైడర్లను నిర్మించారు. రీటెయినింగ్‌ వాల్స్‌ పనులు రెండు మూడు సార్లు ప్రారంభించి, నిలిపివేశారు. డివైడర్లను ఏర్పాటు చేసి రోడ్డు వేయకుండా వదిలేశారు. దీంతో సోమసుందరపాలెం వద్ద, కఠెవరం-విఎస్సార్‌ కళాశాల మద్య రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ద్విచక్రవాహనాలు సైతం కదల్లేని పరిస్థితి నెలకొంది. కనీస ప్యాచ్‌వర్క్‌ కూడా చేపట్టకుండా వదిలేయటంతో ద్విచక్రవాహన చోదకులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటోలు, కార్ల పరిస్థితి చెప్పనవసరం లేదు. మూడు ప్రభుత్వాలు మారినా ప్రధానమైన నాలుగు లైన్ల రోడ్డు పూర్తికాకపోవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైసిపి హయాంలో రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి.
నిధులు మంజూరైనా నిర్మాణం లేదు
రోడ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారు. నాలుగు లైన్ల రోడ్డు పూర్తి చేయకపోగా, తెనాలి-మంగళగిరి రోడ్డు నిర్మిస్తామని చెప్పిన మాటలు హామీలకే పరిమితమయ్యాయి. కనీసం మరమ్మతులకు, ప్యాచ్‌ వర్కులకు నిధులు మంజూరైనా ఆ పనులు కూడా చేయించలేదు. ఈ మార్గంలో నందివెలుగు-దుగ్గిరాల రోడ్డు ప్యాచ్‌ వర్కుకు రూ.3.20 కోట్లు మంజూరైనా పనులు చేయటానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నందివెలుగు గుంటూరు రోడ్డు మరమ్మతులకు కూడా దాదాపు రూ.మూడు కోట్లకు పైగా మంజూరయ్యాయి. అయినా ఆ రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. ఫలితంంగా నందివెలుగు-గుంటూరు రోడ్డు, నందివెలుగు-దుగ్గిరాల రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటంలేదని అధికారులే చెబుతుండడం గమనార్హం.

ప్రమాదకరంగా డివైడర్లు
నాలుగు లైన్ల రోడ్డు విస్తరణలో భాగంగా బస్టాండ్‌ నుంచి ఆటోనగర్‌ వరకూ నిర్మించిన డివైడర్లు ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రయాణీకులకు కనిపించే విధంగా వాటికి కనీసం పెయింట్‌ కూడా వేయలేదు. డివైడర్లు ప్రారంభయ్యే దగ్గర, ముగిసే దగ్గర అవి కనిపించేలా రేడియం స్టిక్కర్లు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో డివైడర్లు రాత్రి వేళల్లో కనిపించక లారీలు వాటి మీదకు ఎక్కేయటం, కార్లు ఢకొీని ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు అనేకం. గతంలో ఇదే విషయాన్ని ట్రాఫిక్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చకు రావటంతో, తక్షణమే డివైడర్లు కనిపించే విదంగా పెయింట్‌ వేసి, రేడియం స్టిక్కర్లను అంటించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఆయినా ఏమాత్రం ప్రయోజనం లేదు. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేయాలని, డివైడర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలను ప్రయాణీకులు కోరుతున్నారు.

➡️