6వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

Dec 17,2023 20:37

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌/గజపతినగరం  :  సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె ఆరోరోజుకు చేరుకుంది. ఆదివారం అంగన్‌వాడీలంతా గ్రామాల్లో పిల్లల తల్లిదండ్రులను కలిసి తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం సమ్మె విచ్చిన్నానికి పాల్పడితే ప్రతిఘటన తప్పదని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్సు యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్‌.అనసూయ తెలిపారు. కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన నిరసన శిబిరం వద్ద విలేకర్లతో వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించకుండా తూతూ మంత్రంగా చర్చలు జరిపి లబ్ధిదారుల వద్ద తప్పుడు ప్రచారం చేయిస్తుందని అన్నారు. గత 30 నుంచి 35 ఏళ్లుగా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు సేవలందిస్తున్న తమకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని పోరాడుతుంటే అధికారులపై ఒత్తిడితెచ్చి తాళాలు పగులగొట్టి కేంద్రాలను ప్రారంభించే చర్యలను మానుకోవాలని కోరారు. అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్‌పిలు, మధ్యాహ్నం భోజన కార్మికులు, ఉపాధ్యాయులు, విఒఎలు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు తమ సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని కోరారు. లేదంటే ఈ పోరాటాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.రాములు, డిపో అధ్యక్షులు సిహెచ్‌వి రావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కె.త్రినాధ్‌, హమాలిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బి.రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వెంకటలక్ష్మి, ఎఆర్‌ఎల జిల్లా అధ్యక్షులు కె. గురుమూర్తి తదితరులు మద్దతు తెలిపారు. సమావేశంలో యూనియన్‌ గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి, జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, జిల్లా కమిటీ సభ్యులు ప్రభా, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌రావు, ఉపాధ్యక్షులు బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.అంగన్వాడీ ఉద్యమ నిర్మాత శారదకు నివాళి విశాఖ అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నిర్మాత, మహిళా ఉద్యమ నేత డి.శారద 19వ వర్థంతి సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు)జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్‌.అనసూయ ఆధ్వర్యాన నివాళులర్పించారు. శారద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు టివి రమణ, జిల్లా కార్యదర్శి జగన్మోహన్‌రావు, ఉపాధ్యక్షులు బి.సుధారాణి , ఆశ వర్కర్స్‌ నాయకులు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల మద్దతు కోరిన అంగన్‌వాడీలు

గజపతినగరం సెక్టార్‌ పరిధిలోని గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో అంగన్‌శాడీ కార్యకర్తలు ఆదివారం తమ గ్రామాల్లో చిన్నారుల తల్లులను కలిసి తమ సమ్మెకు మద్దతు కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్న తమకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సమ్మె చేస్తున్నామని తెలిపారు. అయినాప్రభుత్వం పట్టించుకోకుండా సచివాలయ సిబ్బందితో కేంద్రాల తాళాలను పగులగొట్టి బలవంతంగా తెరిపిస్తున్నారని ఆవేదన చెందారు. గజపతినగరం, పురిటిపెంట, గుచ్చిమి తదితర చోట్ల తల్లులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది కేంద్రాలను తెరిచినా పిల్లలను మాత్రం పంపించబోమని అన్నారు. చిన్నారులను సచివాలయ సిబ్బంది ఎలా చూస్తారని ప్రశ్నించారు. సమ్మెకు తామంతా అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి జ్యోతి, సెక్టార్‌ నాయకులు నాగమణి, ఎం.పార్వతి, పి.అనురాధ, సౌజన్యం తదితరులు పాల్గొన్నారు.

➡️