8వ తేదీ వరకూ విధుల బహిష్కరణ

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కెవికె సురేష్‌
ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా కోర్టు విధులను శుక్రవారం వరకూ బహిష్కరించి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు గుంటూరు బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే ఈ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఈ చట్టం వల్ల వివాదాలు మరింతగా పెరుగుతాయని ఆందోళన వెలిబుచ్చారు. రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రజలకు చిన్న సమస్య వచ్చినా దాని పరిష్కారం కోసం నెలలు, ఏళ్ల తరబడి అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. తాజాగా భూ హక్కు చట్టం అమలునూ రెవెన్యూ శాఖకు ప్రభుత్వం అప్పగిస్తోందని, ఇదే జరిగితే భూ సమస్య వచ్చిన ప్రజల అవస్థ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆందోళనగా ఉందని అన్నారు. ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నీతి ఆయోగ్‌ సూచించగా ఏ రాష్ట్రమూ అందుకు సిద్ధమవలేదని, ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం ఒక ప్రయోగాశాలగా మారిందని విమర్శించారు. ప్రమాదకరమైన ఈ చట్టాన్ని రద్దు చేసే వరకూ తాము పోరాడతామని, అందులో భాగంగా విధుల బహిష్కరణను 8వ తేదీ వరకూ కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు తీర్మానాన్ని జిల్లా బార్‌ ఫెడరేషన్స్‌ ఆమోదించింది. 8వ తేదీన మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని జిల్లా బార్‌ ఫెడరేషన్స్‌ చైర్మన్‌ కెవికె సురేష్‌ వెల్లడించారు.

➡️