Feb 17,2024 21:04

ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యం విడనాడాలిప్రజాశక్తి-పీలేరు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని పీలేరు జెఎసి డిమాండ్‌ చేసింది. జిల్లా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు మేరకు శనివారం భోజన విరామ సమయంలో స్థానిక తహశీల్దారు కార్యాలయం ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రభుత్వం 12వ పీఆర్సీ వేసినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని జెఏసి నాయకులు వాపోయారు. 12వ పిఆర్‌సి ఆలస్యమౌతుండడంతో 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని, పిఎఫ్‌, జిపిఎఫ్‌్‌, ఎపిజిఎల్‌ఐ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే వాటిని మంజూరు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, అవుట్సోర్సింగ్‌, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో పీలేరు జెఏసి నాయకులు, సభ్యులు పాల్గొని తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు : తహశీల్దారు కార్యాలయం వద్ద నుంచి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి చైర్మన్‌ పి.ఓబులేసు మాట్లాడుతూ 30 శాతం మధ్యంతర భతి వెంటనే ప్రకటించాలని, జిపిఎఫ్‌ పిఆర్‌సి అరియర్స్‌, సరెండర్‌ లీవ్‌, డిఎ ఆర్‌ఎస్‌ వెంటనే ఇవ్వాలని కోరారు. జిపిఎస్‌ని రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జెఎసి కోశాధికారి షేక్‌ మహమ్మద్‌ అస్లాం, వైస్‌ ప్రెసిడెంట్‌ కె.సంతోష్‌రెడ్డి, గౌరీ శంకర్‌ సెక్రటరీ విజరువర్మ, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ జె.రవిశంకర్‌ పాల్గొన్నారు. లక్కిరెడ్డిపల్లి : ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లక్కిరెడ్డిపల్లి జెఎసి చైర్మన్‌ కొండూరు బలరామరాజు ప్రభుత్వాన్ని కోరారు. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌జిఒ కార్యదర్శి మల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దేవదానం, రామకృష్ణ, విశ్వనాథ, సాయిపీర్‌, జిల్లా ఉమెన్‌ వింగ్‌ అధ్యక్షులు శాంతమ్మ,పెన్షనర్ల సంఘం అధ్యక్షులు వి.వెంకటరమణ, రామచంద్ర, రహమతుల్లా, వివిధ శాఖల ఉద్యోగులు రహీం ,విమల్‌ కుమార్‌, వెంకటేష్‌, శ్రీనివాసులు, పెన్షనర్లు, కార్మికులు పాల్గొన్నారు.

➡️