9న నులిపురుగుల నివారణ కార్యక్రమం

Feb 7,2024 20:36

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 9న జిల్లాలోని 19 ఏళ్లలోపు వయసు గల బాల బాలికలంందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు చెప్పారు. జిల్లాలో 3.58 లక్షల మంది బాల బాలికలకు ఆరోజు భోజనం అనంతరం నులిపురుగల నివారణ మాత్రలు ఆల్బెండజోల్‌ వేయించేందుకు అవసరమైన 3.80 లక్షల మాత్రలు సిద్ధం చేశామన్నారు. బుధవారం తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మినహా మిగతా పిల్లలందరికీ మాత్రలు వేయించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులకు అక్కడే మాత్రలు ఇస్తారని, పాఠశాల బయట వుండే బాల బాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తామని తెలిపారు. ఆ రోజున మాత్రలు వేయించలేని వారికి ఫిబ్రవరి 16న వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పిల్లలకు పొట్టలో నులిపురుగుల కారణంగా పోషకాల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగి శారీరక, మానసిక లోపాలకు రక్తహీనతకు దారితీస్తుందని పేర్కొన్నారు. తద్వారా పిల్లల్లో చురుకుదనం లోపించి నీరసపడిపోతారన్నారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు తరచూ అనారోగ్యంగా, అలసటగా వుంటూ, ఏకాగ్రత కోల్పోతారని పేర్కొన్నారు. ఇటువంటి పిల్లలకు ఆల్బెండజోల్‌ తో చికిత్స సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య పరిష్కారంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. నులిపురుగుల నివారణ మాత్రలను ఆరునెలలకోసారి పిల్లలకు ఇవ్వాల్సి వుంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో అదనపు జిల్లా వైద్యాధికారి కె.రాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ సూర్యనారాయణ, ఆర్‌బిఎస్‌కె పిఒ డాక్టర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️