9424 పోస్టల్‌ బ్యాలెట్లు పోలింగ్‌

May 8,2024 00:52

గుంటూరులో ఓటు వేసేందుకు వేచి ఉన్న సిబ్బంది
ప్రజాశక్తి-గుంటూరు :
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో 9424 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ జరిగిన పోస్టల్‌ బ్యాలెట్లలో పోలైన ఓట్లు 13,735కు చేరుకున్నాయి. జిల్లాలో మొత్తం 20,755 పోస్టల్‌ బ్యాలెట్లు ఉండగా ఇప్పటి వరకూ 66.17 శాతం ఓట్లు పోలయ్యాయి. 5,6 తేదీల్లో పిఇఒలు, ఎపిఒలు, మైక్రో అబ్జర్వర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించారు. మంగళవారం ఓపిఒలకు నిర్వహించారు. ఓపిఒలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఉదయం 8 గంటల నుండే ఓటర్లు ఫెసిలేటషన్‌ సెంటర్లకు చేరుకున్నారు. కాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో ఓటర్లు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ఒక్కొక్కరు ఓటు వేయటానికి 10 నుండి 15 నిముషాల సమయం పడుతుంది. దీంతో ఆలస్యం జరిగింది. కావున ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్‌ బూత్‌ల సంఖ్య పెంచాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. కొద్ది మందికి డ్యూటీ ఆర్డర్‌లో పేర్కొన్న ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లి ఓటు వేయాలని ప్రయత్నించగా అక్కడ ఓటు లేదని చెప్పటంతో నిరాశ వ్యక్తం చేశారు.

➡️