కోట కైవసానికి యుద్ధం

May 5,2024 21:01

శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ పార్టీ వ్యక్తులు గెలుస్తున్నారో.. అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. టిడిపి ఆవిర్భావం తరువాత జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఏడు పర్యాయాలు అదే ఆనవాయితీ కొనసాగింది. 1989, 2009 ఎన్నికలు మినహా మిగతా అన్నిసార్లు అదే జరిగింది. ఈ నేపథ్యంలోనే శృంగవరపుకోటలో పాగా వేసేందుకు వైసిపి, టిడిపి పోటీ పడుతున్నాయి.

ప్రజాశక్తి – జామి: శృంగవరపుకోట కోట నియోజకవర్గం ఏర్పాటు నుంచి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పును అందిస్తున్నారు. తొలి ముఖ్యమంత్రిని అందించింది కూడా ఇక్కడి నుంచే. గత తొమ్మిది ఎన్నికలు పరిశీలిస్తే.. 1983, 85లో ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి టిడిపి ఆభ్యర్థిగా ఎల్‌బి దుక్కు గెలుపొందగా, అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1989లో ఎల్‌బి దుక్కు విజయం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. 1994 ఎన్నికల్లో నాలుగోసారి దుక్కు గెలవగా, టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో శోభా హైమావతి ఎస్‌.కోట నుంచి గెలవగా, టిడిపి మరోమారు అధికార పీఠం ఎక్కింది. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, కాంగ్రెస్‌ను గెలిపించారు. అప్పుడు కోటలో కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభా రవిబాబు గెలుపొందారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో చిరంజీవి ఎన్నికల అరంగేట్రంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొన్న తరుణంలో ఓట్లు చీలి మళ్లీ టిడిపి అభ్యర్థి కోళ్ల లలితకుమారి విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైందిన. 2014 ఎన్నికల్లో టిడిపి నుంచి రెండో సారి కోళ్ల లలితకుమారి గెలిచి, ఆపార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. గత ఎన్నికల్లో వైసిపి నుంచి కడుబండి శ్రీనివాసరావు గెలవగా, వైసిపి ప్రభుత్వం ఏర్పడింది. ఇలా 1989, 2009 మినహా దాదాపుగా శృంగవరపుకోటలో ఏ పార్టీ గెలుస్తుందో అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌.కోటలో గెలవాలని టిడిపి, వైసిపి భావిస్తున్నాయి.

➡️