చుక్కెదురు!

రాష్ట్రంలో తాజాగా కొలువుదీరిన కూటమి సర్కారులో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. రాష్ట్ర్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పడిన సర్కార్లలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత లభించింది. తాజాగా ఏర్పడిన కూటమి సర్కారులో జిల్లా తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడం గమనార్హం. ఇప్పటి వరకు కడప అసెంబ్లీ స్థానంలో గెలిచిన అభ్యర్థులందరికీ అమాత్యయోగం వరించింది. తాజాగా ఏర్పడిన కూటమి సర్కారులో ఎటువంటి ప్రాధాన్యత లభించకపోవడం టిడిపి శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏర్పడిన సర్కారులో సీనియర్‌ ఎమ్మెల్యేలతోపాటు, జూనియర్‌ ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రాధాన్యత లభించలేదు. సీనియర్‌ ఎమ్మెల్యేల మధ్య పొసగని రాజకీయ నేపథ్యం వ్యవహారం బెడిసికొట్టింది. ఉమ్మడి కడప జిల్లాను యూనిట్‌గా తీసుకుని అన్నమయ్య జిల్లాలో కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన యువ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి అమాత్య యోగం వరించింది. టిడిపి నాయకునిగా ఉన్న సమయంలో చోటు చేసుకున్న మదనపల్లి అల్లర్ల కేసులో చురుకుగా స్పందించిన నేపథ్యం మండిపల్లికి అమాత్యపదవి వరించిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లా పరిధిలో రాయచోటి ఉండడంతో మంత్రి పదవిని కేటాయించారు. యువ నాయకుడు నారా లోకేష్‌ ముద్ర ఉండాలనే ఉద్దేశమూ స్పష్టంగా కనిపించింది. కడప జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించని నేపథ్యంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు చెందిన టిడిపి శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది. 2014-19 టిడిపి హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు కడప జిల్లాలో టిడిపికి ఒక్క స్థానమూ ఇవ్వలేదని పలుమార్లు ప్రస్తావన చేసిన సంగతి తెలిసిందే. తాజా సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో టిడిపిని పెద్దఎత్తున ఆదరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గంలో ఎటువంటి ప్రాధాన్యత కల్పించకపోవడం గమనార్హం. వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా కావడంతోనే శీతకన్ను వేశారు. రాష్ట్ర మంత్రివర్గ కేటాయింపులో వివక్ష చూపించిన నేపథ్యంలో జిల్లా అభివృద్ధి విషయంలో ఎటువంటి వివక్ష చూపిస్తారోననే విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఇటువంటి ఆలోచనకు అవకాశం ఇవ్వడం టిడిపి స్వయం కృతాపరాదమని చెప్పవచ్చు.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి

➡️