వెంటాడుతున్న ఉపాధ్యాయుల కొరత

Jun 17,2024 23:36

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : అభివృద్ధికి తొలి మార్గంగా భావించే విద్యారంగంలో మార్పు కోసం పల్నాడు ఎదురు చూస్తోంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మణిమకుటాల్లా వెలుగొంతుతున్న పాఠశాలలు సైతం ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నారు. రెండు వేల మంది విద్యార్థులను ఒడిలో చేర్చుకున్న పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జెడ్‌పి పాఠశాల, 1100 మందికి విద్యనందిస్తున్న దాచేపల్లి జెడ్‌పి పాఠశాల, వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న బ్రాహ్మణపల్లి జెడ్‌పి పాఠశాలలు సైతం ఉపాధ్యాయుల కొరతతో భర్తీ కోసం నిరీక్షిస్తున్నాయి.పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ అధారిత కుటుంబాలు అధికంగా ఉంటాయి. రోజు పని చేసుకుంటేనే కాని పూటగడవని కుటుంబాలే ఈ ప్రాంతంలో అధికం. ఈ కుటుంబాల్లోని వారంతా తమ పిల్లలను ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. అయితే ఆ పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక ఉత్తీర్ణత శాతం పడిపోతుండడంతో చాలా మంది తమ పిల్లల్ని పంపించడం ఆపేస్తున్నారు. ఆర్థికంగా కష్టమైనా ప్రైవేటు పాఠశాలలకు పంపేందుకు సిద్ధమవుతుండగా కొంతమంది తమ పిల్లల్ని చదువులు మాన్పించి పనులకు తీసుకెళ్తున్నారు. ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రధాన కారణంగా ఉపాధ్యాయుల కొరత అనే వాదన వినిపిస్తోంది.ప్రభుత్వ నిభందనల ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలి. కాని గురజాలలోని జెడ్‌పి పాఠశాలలో సుమారుగా 350 మంది విద్యార్ధులు ఉండగా ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అదే మండలంలోని తేలుకుట్ల జెడ్‌పి పాఠశాలలో 17 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా ఏడుగురే ఉన్నారు. పిడుగురాళ్లలోని మన్నెం పుల్లారెడ్డి జెడ్‌పి పాఠశాలలో రెండు వేల మంది విద్యార్ధులుండగా నలుగురు హిందీ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాచేపల్లి జెడ్‌పి పాఠశాలలో సోషల్‌, హిందీ, పీఈటీతోపాటు మరికొంతమంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్రాహ్మణపల్లి జెడ్‌పి పాఠశాలనూ ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. గతంలో గురజాల మండలంలోని మాడుగలలో ఉపాధ్యాయులు కొరతతో ఇబ్బందుల పడ్డ విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం సన్నగిల్లుతోంది. ఉపాధ్యాయుల కొరతను తీర్చడం ద్వారా చదువుల్లో నాణ్యతను పెంచి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేలా నూతన ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️