మారుమూల తండాలో మా’స్టారు’

Apr 11,2024 00:02

లచ్చంబావి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విశ్వనాథం మాస్టారు
ప్రజాశక్తి – మాచర్ల రూరల్‌ :
టీచర్‌ ఉద్యోగమంటే పిల్లలకు పుస్తకంలోని పాఠాల వరకు చెప్పి కానిచ్చేయడం ఆ మాస్టారుకు అసలు ఇష్టం ఉండదు. చేసే పనికి సార్థకత ఉండాలనే తపన ఆయనలో నిత్యం కనిపిస్తుంది. అందుకే విద్యాసంవత్సరానికి సంబంధించిన పాఠ్యాంశాలతోపాటు తన విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ‘మా మంచి మాస్టారు’ అనిపించుకుంటున్నారు విశ్వనాథం మాస్టారు. ఏ సౌకర్యాలూ లేని ఆ ఊర్లో ఉద్యోగం చేయటమే ఒక సాహసమైతే. అలాంటిది అక్కడే నివాసం ఉంటూ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తపన పడుతున్న ఉత్తమ గురువు గురించి..మాచర్ల మండలంలోని లచ్చంబావితండా (లక్ష్మీనారాయణపురం) మాచర్లకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ నల్లమల అటవీ ప్రాంతం. పైగా టైగర్‌ ప్రాజెక్టు జోన్‌. ఆ తాండాలో మండల పరిషత్‌ ఆదర్శ పాఠశాలలో దుప్పల విశ్వనాథం హెచ్‌ఎంగా పని చేస్తున్నారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాలు భోదిస్తూనే తమ విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేసేందుకు ప్రత్యేక శిక్షణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. 2024-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ విడుదల కాగా ఈనెల 27న పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఒక యూనిట్‌గా 6 బిసి గురుకుల పాఠశాలున్నాయి. వీటిలో బాలురలకు మూడు, బాలికలు మూడు పాఠశాలు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి 4వ తరగతికి చెందిన తమ పాఠశాలలలోని విద్యార్థులకు విశ్వనాథం మాస్టారు తర్ఫీదు ఇస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు 18 మందిని సిద్ధం చేస్తున్నామని, గత నెలలో జరిగిన అంబేద్కర్‌ గురుకులాల ప్రవేశానికి ఐదుగురు విద్యార్థులు తమ పాఠశాల నుండి అర్హత సాధించారని విశ్వనాథం తెలిపారు.

➡️