రజకులకు సామాజిక చట్టం చేయాలి

Jun 17,2024 23:34

మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి-గుంటూరు :
రజకులకు సామాజిక రక్షణ చట్టం చేసి, రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని ఆంధ్ర ప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభాపురం వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రజకులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. సోమవారం పాతగుంటూరులోని సంఘ కార్యాలయంలో మండూరు వెంకట నరసయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో రజకులపై అగ్రవర్ణ పెత్తందారులు అనేక దాడులు, దౌర్జన్యాలు చేశారని, అక్రమ కేసులు బనాయించారన్నారు. రజకుల రక్షణకు వెంటనే సామాజిక రక్షణ చట్టం చేసి, రజకుల అభివృద్ధి-సంక్షేమ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి రజకుల అభ్యున్నతికి కృషి చేస్తామని, 50 ఏళ్లు నిండిన రజక వృత్తిదారులందరికీ పింఛను మంజూరు చేస్తామని, ఆదరణ పథకం ద్వారా రజకులకు వృత్తి నిర్వహణలో తోడ్పాటు అందిస్తామని కూటమి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వెంటనే హామీల అమలు చేయాలని కోరారు. ఈనెల 29న గుంటూరు నగర రజక వృత్తిదారుల సంఘం మహాసభ కృష్ణ నగర్‌ ఒకటో లైన్‌లో నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. నగరంలోని రజక సోదరులందరూ, అపార్ట్మెంట్‌ వాచ్మెన్‌-కం-ఇస్త్రీదారులు అందరూ ఈ మహాసభలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించుకొని రాబోయే కాలంలో రజకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి బొజ్జా సుబ్బారావు, పాగోలు శ్రీనివాసరావు, వెంపాటి చిన్నకొండయ్య (సీతయ్య), అద్దంకి సాంబశివరావు, పేరుపాలెం రాంబాబు, భాస్కరరావు, ఫణిదపు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️