ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారమెప్పుడో?

Apr 26,2024 20:43

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : జిల్లా కేంద్రంగా విలసిల్లుతున్న పార్వతీపురం పట్టణం నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో విలవిలలాడుతుంది. సుమారు 22ఏళ్ల క్రితం డివిజన్‌ కేంద్రంగా ఉన్న పట్టణంలోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్ల విస్తరణ తర్వాత, అనూహ్యంగా పట్టణం బెలగాం వరకూ వాణిజ్య పరంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. మెయినరోడ్‌కు అనుకొని బంగారం, రడీమేడ్‌, ఫర్నిచర్‌ వంటి వాణిజ్య సముదాయాలు వెలియడంతో పాటు, ద్విచక్రవాహనాలు వాడకం అధికం కావడంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల రహదారి ట్రాఫిక్‌ సమస్యతో బాధపడుతుంది. ఇప్పుడు మన్యం జిల్లా కేంద్రం కావడంతో రహదారి సమస్య మరింత జఠిలంగా మారింది. గత టిడిపి ప్రభుత్వంలో ఈ సమస్య పరిష్కారానికి పట్టణం చుట్టూ ఔటర్‌ రింగ్‌రోడ్‌ రూ.33కోట్లతో ప్రతిపాదనలు జరిగినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రతిపాదన బుట్టదాఖలు చేసింది. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే గానీ, ఎంపి గొడ్డేటి మాధవి గాని ఏనాడు చట్టసభల్లో ప్రస్తావించిన దాఖాలాల్లేవు. జిల్లా ఏర్పాటు తర్వాత పట్టణంలో రహదారులు, ఉద్యానవనాలు, పార్కింగ్‌ స్థలాలు, ఇతర సౌకర్యాలు పూర్తిస్థాయిలో జనాభాకు అనుగుణంగా కల్పించాల్సి ఉంది. కానీ జిల్లా ఏర్పడి రెండేళ్లు దాటినా ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. పట్టణానికి ప్రతిరోజు 15 మండలాల ప్రజలతో పాటు, అంతర్‌రాష్ట్రాలైన ఒడిషా, చత్తీష్‌గడ్‌ల నుండి చిన్న, పెద్ద వాహనాలు మెయిన్‌రోడ్‌పైనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికి తోడు స్థానిక పోలీసులు పటిష్టమైన ట్రాఫిక్‌ నియంత్రణను గాలికి వదిలివేశారు. కనీసం పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుపై కనీసం దృష్టి పెట్టలేదు. ఆర్‌టిసి కూడలి, సౌందర్య థియేటర్‌, సారికవీధి, నాలుగురోడ్ల కూడలి, పాతబస్టాండ్‌ ప్రాంతాల్లో ప్రజలు ట్రాఫిక్‌ రద్దీతో కుస్తీలు పడుతున్నారు. పట్టణ జనాభా అధికారికంగా 62వేలు అని చెపుతున్నప్పటికీ కొత్తగా విస్తరించిన కాలనీలతో జనాభా అనధికారికంగా లక్షకు పైగానే ఉంది. వేలకొలది ద్విచక్ర వాహనాల వాడకం పెరగడం, దానికి తగ్గట్టుగా వాణిజ్య సముదాయాల ముందు పార్కింగ్‌ స్థలాల్లేకపోవడంతో వాహనాలన్నీ ప్రధాన రహదారిపైనే పార్కింగ్‌ చేసే పరిస్ధితి. గతంలో ప్రతిపాదించిన ఔటర్‌రింగ్‌రోడ్డు ప్రతిపాదనలకు పట్టాలెక్కించి, జిల్లా కేంద్రానికి అనుగుణంగా రహదారి నిర్వహణ, పార్కింగ్‌ స్థలాలు, ఉద్యాన వనాలు ఏర్పాటు చేసి పట్టణానికి పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

➡️