దాహార్తి తీరుస్తున్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు

ప్రజాశక్తి-దర్శి : దర్శిలోని శివరాజ్‌ నగర్‌ సమీపంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కెనాల్‌ పక్కన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును 1977లో నిర్మించారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఈ సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు ద్వారా దర్శి, పొదిలి మండలాల ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది కష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలు పడనందున నాగార్జునసాగర్‌కు నీరు రాలేదు. తాగునీటి అవసరాల కోసం ఏప్రిల్‌ నెలాఖరులో ఐదు టిఎంసిల నీటిని సాగర్‌ కుడికాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఎన్‌ఎపి స్కీంకు అధికారులు 200 హెచ్‌పి 2 సామర్థ్యం కలిగిన రెండు పంపులు, రెండు 100 హెచ్‌పి పంపులు, మూడు 75 హెచ్‌పి పంపుల ద్వారా నీటిని ట్యాంకు 70 శాతం వరకూ నింపారు. ఈ నీటిని వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు వారానికి రెండు రోజులు చొప్పున గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. దర్శి మండలంలో 55 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎఇ చైతన్య తెలిపారు. ముండ్లమూరు స్కీం ద్వారా 42 గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ముండ్లమూరు మండలంలో మారెళ్ళ ఆమ్లెట్‌ పరిధిలో ఎనిమిది గ్రామాలకు నీటిని సరఫరా చేయలేదన్నారు. ఆ గ్రామాలలో డ్రీ బోర్లు ద్వారా నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. దర్శి స్కీమ్‌ ద్వారా వేసవిలో తాగునీటి అవసరాల కోసం వదిలి నీటిని ప్రజలు పొదుపుగా వినియోగించుకోవాలని ఎఇ చైతన్య తెలిపారు. ఏడు ఫిల్టర్‌ బెడ్‌ల ద్వారా నీటిని శుద్ధిచేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ముండ్లమూరు స్కీంకు ప్రత్యేకంగా రాపిడ్‌ ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేసి నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దర్శి మండలంలో పెదవులవాడ, చిన్న ఉయ్యాలవాడ, కష్ణాపురం, కొర్లమడుగు గ్రామాలకు రామతీర్థం స్కీం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా దర్శి ఎన్‌ఐపి స్కీం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎఇ చైతన్య తెలిపారు.

➡️