అటవీ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు చేయాలి

మాట్లాడుతున్న ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర

ప్రజాశక్తి-అరకులోయ :ఆదివాసులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు, చిపుళ్లతో 24 రకాలు ఆదివాసి రైతులు పండిస్తున్న పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ లు డిమాండ్‌ చేశారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటిడిఏ పరిధిలో ఆదివాసులు సేకరిస్తున్న చింతపండుకు కిలో రూ.60లు మద్దతు ధర ప్రకటించాలని ప్రతి సంతలో చింతపండు కొనుగోలు కేంద్రాలు జిసిసి ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసి రైతులు పండిస్తున్న పసుపు పంటకు కిలో రూ.200 కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వారపు సంతల్లో దళారుల మోసాలను అరికట్టి, జిసిసి ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదివాసులు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు చింతపండు చీపుళ్ళు, ఉసిరికాయ, ఇతర అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పి.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️