ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన ధర్నా

మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం నేత అప్పలనర్స

ప్రజాశక్తి -పాడేరు: ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటర్లను తక్షణమే రెన్యువల్‌ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం నుండి ఐటిడిఏ వరకు ర్యాలీ నిర్వహించారు. గేటు దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో నినాదాలతో హౌరెత్తించారు. అనంతరం జరిగిన ధర్నాలో ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ మాట్లాడుతూ, అక్షరాస్యత పెంచడం, నైపుణ్యత సాధించడంలో ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటీర్లు పాత్ర కీలకమని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 వేల స్కూళ్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 1400 పాఠశాలల్లో మాత భాష విద్య బోధన ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.మాతృభాషా వాలంటీర్లను రెన్యువల్‌ చేసే పద్ధతులు పాలకులు మార్చుకోవాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ, ప్రభుత్వ, మండల పరిషత్‌ స్యూల్స్‌ లో స్థానిక ఆదివాసీ ‘మాతృభాష విద్యా బోధన కోసం స్థానిక యువతి యువకులను రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1327 మందిని 2023 – 24 విద్యా సంవత్సరంకు గాను ఫాఠశాల విద్యా కమిటీ ద్వారా నియమించిందని తెలిపారు. కొద్దిగా నిధులు కేటాయించారని, అందుకే పిబ్రవరి 29 వరకే కాల పరిమితం చేశారని ఆయన మండిపడ్డారు. తక్షణమే మార్చి, ఏప్రిల్‌ నెలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. డైట్‌, డిగ్రీ, ఇంటర్‌ మీడియట్‌ ఉత్తీర్ణులైన ఉన్నత విద్యావంతులు బోధించడంతో ప్రాథమిక విద్యలో నాణ్యత, నైపుణ్యత పెరిగి, డ్రాపౌట్స్‌ సంఖ్య తగ్గిందని తెలిపారు. ఆదివాసీ ప్రజల్లో జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు భాహ్య ప్రపంచం తో అనుసంధానం పెరిగిందన్నారు. మాతృభాష బహుభాష ఆధారిత విద్యా బోధకులను కేంద్ర ప్రభుత్వం శాశ్వతంగా కొనసాగిేంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌కు వినతి ఆదివాసీ మాతృ భాష విద్య వాలంటీర్లు రెన్యువల్‌ చేయాలనీ ఐటిడిఏలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, పాడేరు ఐ.టి.డి.ఏ పి. ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌తో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సర్బు నాయుడు, చంద్రయ్య, వీరయ్య, గణస్‌, కుమారి, రమేష్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️