పివిటిజిల అభ్యున్నతికి కృషి

హాజరైన గిరిజనులు

ప్రజాశక్తి-అరకులోయ :ఆదివాసీల (పివిటిజిలు) సంక్షేమమే కేంద్ర ప్రభుత్వం ఆశయమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. అరకులోయ మండలం కొత్త భల్లుగుడ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ ముఖాముఖి సమావేశంలో ఆయన ఆదివాసీ గిరిజనులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు మారుమూల గిరిజనులకు చేరితేనే నిజమైన అభివృధ్ది అని స్పష్టం చేసారు.అర్హులైన పివిటిజిలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.రైతులకు ఆర్దిక సహాయం అందించడానికి పి.ఎం కిసాన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజనలో ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు, ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, పి.యం. ఆవాస్‌ యోజన గృహ నిర్మాణ పథకం, అటవీ హక్కు పత్రాల పంపిణీ, ఆధార్‌ కార్డుల జారీ, జన్‌ధన్‌ ఖాతాలు ప్రారంభించడం, వన్‌ ధన్‌ వికాస కేంద్రాలు ఏర్పాటు, పి.యం. జల్‌ జీవన్‌ వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు..పాడేరు ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌ మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి జన్‌ జాతి ఆదివాసీ మహా అభియాన్‌ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు.పి.యం .జన్‌ మన్‌ ద్వారా 11 ప్రభుత్వ శాఖ ల అధ్వర్యంలో పక్కా ఇళ్లు, ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు, అటవీ హక్కుపత్రాలు, ఇంటింటికి తాగునీటి పథకాలు అందంచడం జరుగుతోందన్నారు.జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు జె. సుభద్ర మాట్లాడుతూ పోడు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలకు ఉన్నత స్థాయి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు.పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, కేంద్ర గిరిజన వ్యవహారాల జాయింట్‌ సెక్రటరీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌, ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్‌. ప్రభాకరరావు, ఎం.వేంకటేశ్వరరావు జి.చిన బాబు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, ఇఇ ఎ. వేణు గోపాల్‌, ఎటిడబ్ల్యూఓ ఎల్‌.రజని, మ్యూజియం మేనేజర్‌ మురళి పాల్గొన్నారు.

➡️