బాల్య వివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు

మాట్లాడుతున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ అప్పారావు

ప్రజాశక్తి-పాడేరు:బాల్య వివాహల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ఆంధ్ర ప్రదేశ్‌ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు వెల్లడించారు. స్థానిక కాఫీ హౌస్‌లో సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు ఎన్‌.సూర్యలక్ష్మి అధ్యక్షతన బాల్య వివాహాల నివారణపై నిర్వహంచిన అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా అతిధులు చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బాలికా విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బాలికలు ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య దోహద పడుతోందన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలకు, దుర అలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు. తలిదండ్రులు కాయకష్టం చేసి చదివిస్తున్నారని ఉన్నతంగా చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థినీ, విద్యార్థులు ఐఎఎస్‌, ఐపిఎస్‌, గ్రూప్‌ -1 వంటి కొలువులు సాధిస్తున్నారని చెప్పారు. వసతి గృహాలలో చదువుకుంటున్న పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. డ్రాపౌట్లు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు.పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి బాగ్యలక్ష్మి మాట్లాడుతూ, బాలికల హక్కులను కాపాడ వలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గిరిజన ప్రాంతాలలో బాలింతలు, గర్భవతులకు, చిన్న పిల్లలకు సంపూర్ణ ప్లస్‌ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు రాలేని వారి ఇళ్లకే పోషకారాన్ని చేరవేయడం జరుగుతోందన్నారు. పిసిపి అండ్‌ డిటి చట్టం సమర్ధవంతంగా అమలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా పోలీస్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన తరువాత బాల్య వివాహాలను అరి కడుతున్నామన్నారు. ప్రతీ విద్యార్థి కనీసం డిగ్రీ వరకు చదువు కోవాలని బాలికా విద్య సమాజ అభివృద్ధికి దోహద పడుతుందన్నారు.ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్‌ మాట్లడుతూ ఆడ పిల్లలను చదివించాలని సూచించారు. చదువే వెలుగని ఆడపిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 21 సంత్సరాలు నిండిన తరువాతే వివాహం చేసుకోవాన్నారు. తలిదండ్రులు బలవంతంగా బాల్య వివాహాలు చేస్తే వ్యతిరేకించాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే సచివాలయం సిబ్బందికి, మహిళా పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ కె. ధీరజ్‌ మాట్లాడుతూ, 20 ఏళ్లు కష్ట పడి చదివితే 60 ఏళ్లు సుఖ పడతారని పేర్కొన్నారు. విద్యార్ధి దశ చాలా కీలకమైనదని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. లక్ష్యం సాధించాకే వివాహం చేసుకోవాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మెంబరు గొండు సీతారాం మాట్లాడుతూ,బాల్య వివాహాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యకు ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే సెంటర్లపై టాస్క్‌ ఫోర్సు కమిటీ ఏర్పాటు చేసి పటిష్టమైన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జమాల్‌ భాషా, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, డిఇఓ బ్రహ్మాజీ, ఐసి డిఎస్‌ సిడిపిఓలు, సూపరిండెంట్‌ మూర్తి, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.

➡️