మన్యంలో దట్టంగాపొగ మంచు

Jan 28,2024 23:56
పాడేరులో ఉదయం 8 గంటల సమయంలో పొగమంచు

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: అల్లూరి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత తగ్గడం లేదు. ఉదయం 9 గంటల వరకు పాడేరు, చింతపల్లి, అరకులోయ ప్రాంతాలలో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. 10 గంటల వరకు భానుడు కనిపించడం లేదు. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డు వద్ద, జిల్లా కేంద్రం పాడేరులో 13.8, చింతపల్లిలో 12.8, అనంతగిరి 13.4, పెదబయలు 13, హుకుంపేట 14.6, అరకు 12.8, జికె వీధి 11.6, జి.మాడుగుల 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నెలకొంది. పొగ మంచు అధికంగా ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహన చోదకులు లైట్లు వేసుకుని వాహనాలు నడుపుతున్నారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో, మన్యం వాసులు మంటలు తాగుతూ, ఉన్ని దుస్తులు ధరిస్తూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు. వ్యవసాయ పనులు, వారపు సంతలకు వెళ్లే గిరిజనులు పొగ మంచుతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలతో పాటు గిరిజన గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీని సందర్శిస్తున్న పర్యాటకులను పొగ మంచు అందాలు ఆకర్షిస్తున్నప్పటికీ చలిపులితో వణుకుతునే అహ్లాదకర వాతావరణంలో సందడి చేస్తున్నారు.

➡️