షోకాజ్‌ నోటీసుల దగ్ధం

అరకులోయలో నోటీసులు దగ్ధం చేస్తున్న సురేంద్ర, ఉమామహేశ్వరరావు, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నెల 20 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారం 20వ రోజు కొనసాగింది. సమ్మెలో భాగంగా ఐటిడిఏ ఎదుట నిరసన దీక్ష కొనసాగించారు. అల్లూరి జిల్లాలో సమ్మె చేస్తున్న 430 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఈనెల 7న సమగ్ర శిక్ష జిల్లా ఆదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ సోకాజ్‌ నోటీసులు వాట్సాప్‌ ద్వారా జారీ చేశారు. అనుమతి లేకుండా సమ్మె చేస్తున్నారని దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ కస్తూర్బా టీచర్లు డీఈవో కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.ఐటిడిఏ ఎదుట దీక్ష శిబిరం వద్ద సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు సోకజ్‌ నోటీసుల ప్రతులను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండి అనిల్‌ కుమార్‌, జైరాజ్‌ మాట్లాడుతూ, తమ డిమాండ్ల పరిష్కారం కోసం గత నెలలో అధికారులకు నోటీసు ఇచ్చి సమ్మె చేపట్టామని చెప్పారు. సమ్మెపై తమను వివరణ ఇమ్మని నోటీసులు ఇవ్వడం అసమంజసమన్నారు. జిల్లాలోని సమగ్ర శిక్ష లో పని చేస్తున్న కస్తూర్బా టీచర్లు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మండల కోఆర్డినేటర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, సీఆర్పీలు మెసెంజరు,్ల భవిత ఆయాలు తదితరులు 430 మందికి ఈ నోటీసులు జారీ చేశారని ఆయన చెప్పారు. మినిమం టైం స్కేల్‌ అమలు, హెచ్‌ఆర్‌ పాలసీ ఇస్తామని, రెగ్యులర్‌ చేస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నాయకులు కే.కాళిదాస్‌, కొండబాబు, పి సింహాచలం, ఉపేంద్ర, సిహెచ్‌. కామేశ్వరరావు, పాడి పంతులు, సుభద్రమ్మ, సుజాత, భారతి తదితరులు పాల్గొన్నారు.అరకులోయ:కేజీబీవీ ఉద్యోగుల తొలగింపు నోటీసును వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ అరకులోయలో ప్రజా సంఘాల నేతలు స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం తొలగింపు జీవో కాపీలను దగ్ధం చేశారు. గత కొంతకాలంగా ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాల్సిన పోయి ఉద్యోగులపై బెదిరింపులకి పాల్పడుతుందని విమర్శించారు.సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకు లోయ లో నోటీసులు దగ్ధం చేశారు. ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, సమ్మె చేయడం కార్మికుల హక్కు అని అన్నారు. జగన్‌ కార్మికులు, చిరు ఉద్యోగుల జోలికి వెళ్లి తన గొయ్యితానే తవ్వుకుంటున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సింహాద్రి, కే.మగ్గన్న, ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు జి.బుజ్జిబాబు, రాము, ఆదివాసి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు జోషి తదితరులు పాల్గొన్నారు.ముంచింగిపుట్టు: సర్వ శిక్ష అభియాన్‌, కేజీబీవీ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయడాన్ని సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు భీమరాజు తీవ్రంగా ఖండించారు. ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయం ఎదుట ఆ సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, ఆదివాసి గిరిజన మహిళ సంఘం (ఐద్వా) మండల కార్యదర్శి విజయ సోకాజ్‌ నోటీసులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పి .భీమరాజు, ఎంఎం శ్రీను మాట్లాడుతూ, జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు, లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌, జర్రెల ఉప సర్పంచ్‌ గణపతి పాల్గొన్నారు.పెదబయలు:కేజీబీవీ పాఠశాల, కళాశాలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌, ఉద్యోగులపై ప్రభుత్వం ఇచ్చిన సోకాజ్‌ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నోటీస్‌ పత్రాలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు బొండా సన్నిబాబు మాట్లాడుతూ, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, కనీస టైం స్కేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మాన పడాల్‌, మండల అధ్యక్షులు బొండా గంగాధరం, కార్యదర్శి సర్బన్న పాల్గొన్నారు.

➡️