నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు శ్రీకారం

Apr 18,2024 00:03
స్వీకరించేందుకు

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలో ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఈనెల 18న గురువారం నుంచి మొదలవుతోంది. జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అరకు, పాడేరు పార్లమెంట్‌ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు సిద్ధం చేశారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత నుండి 24వ తేదీ వరకు సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించ నున్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన, 29న మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు. అదేవిధంగా శాసన సభకు పోటీ చేసే అభ్యర్ధులు రూ.10 వేల డిపాజిట్‌ చెల్లించవలసి ఉంది. ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మినహాయింపుతో చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా శానసభకు నామినేషన్‌ వేసే అభ్యర్దులు నామినేషన్‌ సమర్పించే సమయంలో పాటించవలసిన సూచనలను తదితర విషయాలపై అధికారులు వివరించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్స్‌, రోజువారి నివేదికలు పంపిణీ, ఏపీక్‌ కార్డులు జనరేషన్‌, సీజర్‌ మ్యానేజ్‌ మెంట్‌ రిపోర్టు తదితర అంశాలపై అల్లూరి జిల్లా కలెక్టర్‌, జిల్లాలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అదికారి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నిఘా బృందాలను పటిష్టం చేయాలని, అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో అరకు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ వ్యవహరిస్తున్నారు. అరుకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల నుంచి వీరి నామినేషన్లను పార్వతీపురం కలెక్టరేట్లో స్వీకరిస్తారు. పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్‌కు అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. పాడేరు అసెంబ్లీ స్థానం పోటీ చేసే అభ్యర్థులు నుంచి అల్లూరి జిల్లా కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి విభిషేక్‌ అరుకు అసెంబ్లీ సెగ్మెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అరకు అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి పాడేరు ఐటిడిఏలో నామినేషన్లను స్వీకరిస్తారు.

➡️