పండగలోనూ తగ్గని ఉద్యమ స్ఫూర్తి 

anganwadi workers strike 36days

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : తమ సమస్యల పరిష్కరించాలంటూ అంగన్వాడీలు గత 36 రోజులుగా సమ్మెబాట పట్టిన నేపథ్యంలో సోమవారం, మంగళవారం మకర సంక్రాంతి, కనుమ పండుగనాడు కూడా అంగన్వాడీలు సమ్మె శిబిరం వద్ద రంగుల ముగ్గులు వేసి, కార్మిక సంఘాల పాటలకు లయబద్ధంగా నృత్యాలు చేసి అక్కడే నిరసన తెలిపి ఉద్యమ స్ఫూర్తి చాటుకున్నారు. శిబిరం వద్ద అంగన్‌వాడీలు ఎస్మా చట్టం ప్రతులను మంటల్లో వేసి దహనం చేశారు. సమ్మె డిమాండ్లు ప్రతిబింబించేలా సంక్రాంతి ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్ కుమారి, కె వెంకటలక్ష్మి మాట్లాడుతూ, తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాల్సిన భోగి మంటలను, సంక్రాంతి, కనుమ పండుగను కూడా నిరసన శిబిరంలో చేసుకోవాల్సిన దుస్థితికి వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అంగన్‌వాడీలు తమ ఆకలి కేకలతో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను నడి రోడ్డుపై జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు,ఇప్పటివరకు ప్రభుత్వంతో ఆరు దఫాలు చర్చలు జరిపైన తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు కనుగుణంగా వేతనాలు పెంచమని 36 రోజులుగా సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం, మంత్రులు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తు, అంగన్వాడీలపై బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు,వేతనాలు పెంచేదాకా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. అంగన్‌వాడీల సమ్మెకు రోజురోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాంశాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు సభ్యులకు వివరించారు, అంగన్‌వాడీలు చాలా పట్టుదలతో చేస్తున్న సమ్మె అనేక ఉద్యోగ,కార్మిక సంఘాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కారంచడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు, ఇదే పట్టుదలతో వేతనాలు పెంచుకునేంతవరకు సమ్మెను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు ఎల్ సత్యవతి, నూక రత్నం, నర్సవేణి, రమణి, మంగ, చిన్నమ్ములు, సుందరమ్మ, రత్నం, నాగమణి, రాధా, భవాని, రాజేశ్వరి, లక్ష్మీ, వీరయ్యమ్మ, వీరలక్ష్మి తది తరులు పాల్గొన్నారు.

➡️