ఎఎన్‌సికి ఎదురుదెబ్బ

మూడు దశాబ్దాల పాటు దక్షిణాఫ్రికాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎఎన్‌సి)కి మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది. గతవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 112 ఏళ్ల చరిత్ర కలిగిన ఎఎన్‌సి ఓటింగ్‌ బలం 57 శాతం నుండి ఒక్కసారిగా 40 శాతానికి పడిపోయింది. శ్వేతజాతి దురహంకార పాలన నుంచి దక్షిణాఫ్రికాను 1994లో విముక్తి చేయడంలో వీరోచిత పాత్ర పోషించిన నెల్సన్‌ మండేలా నేతృత్వంలోని పార్టీ కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలతో కలసి దేశాన్ని ప్రజాతంత్ర విప్లవ మార్గంలో పరివర్తన సాగిస్తామని ప్రతిన బూనింది. నెల్సన్‌ మండేలా, ఎంబెకి నాయకత్వంలో ఎఎన్‌సి కొన్ని విజయాలు సాధించింది. ఆ తరువాత వచ్చిన జాకబ్‌ జుమా అవినీతి ఆరోపణలతో 2018లో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడం, ఆ తరువాత వచ్చిన రమాఫొసా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో వైఫల్యం ఆపార్టీ ప్రస్తుత స్థితికి ఒక కారణమైతే, ఎఎన్‌సిని ఎలాగైనా అధికారం నుంచి తొలగించాలని సామ్రాజ్యవాద శక్తులు మరీ ముఖ్యంగా అమెరికా సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు మరో కారణం. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, హింసాత్మక నేరాలపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ని గ్రహించి సకాలంలో దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో ఎఎన్‌సి నాయకత్వం సమర్థవంతంగా వ్యవహరించ లేకపోయింది. ఎఎన్‌సిలో భాగ స్వాములుగా ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ఆఫ్‌ సౌతాఫ్రికా ట్రేడ్‌ యూనియన్స్‌ (కొసాటు) చేసిన హెచ్చరికలను ఎఎన్‌సి నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు. 400 స్థానాలున్న పార్లమెంటులో కనీస మెజార్టీకి 201 స్థానాలు అవసరం కాగా, ఎఎన్‌సికి పోలైన ఓట్ల దామాషా ప్రకారం 159 స్థానాలే వచ్చాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. ఇప్పుడు సంకీర్ణ భాగస్వాముల కోసం చర్చలు సంప్రదింపులు జరుపుతోంది. రమాఫొసాను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పిస్తే సంకీర్ణంలో చేరతామని ఎంకె వంటి పార్టీలు షరతు పెడుతున్నాయి. ఇటువంటి షరతులను అంగీకరించేది లేదని ఎఎన్‌సి నాయకత్వం స్పష్టం చేయడంతో చర్చల ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. 21.81 శాతం ఓట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ (డిఎ)తో పొత్తును కమ్యూనిస్టులు, కొసాటు వ్యతిరేకిస్తున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదుల ప్రోత్సాహం, శ్వేత జాతి నిధులతో నడిచే జాన్‌ స్టీన్‌ హుస్సేన్‌ నాయక త్వంలోని మితవాద డెమొక్రటిక్‌ అలయన్స్‌ (డిఎ)ని చేర్చుకోవడం కన్నా భావసారూప్యత కలిగిన జాకబ్‌ జుమా, జులియన్‌ మలేమాల నేతృ త్వంలోని పార్టీలను కలుపుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో 2018లో అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన జుమా నేతృత్వంలోని ఎంకెపి 14.58 శాతం ఓట్లతో మూడో పెద్ద పార్టీగా నిలవగా, ఎఎన్‌సి యూత్‌ లీగ్‌కు ఒకప్పుడు నాయకత్వం వహించిన జులియస్‌ మలేమా నేతృత్వంలోని ఎకనమిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ (ఇఎఫ్‌ఎఫ్‌) పార్టీ 9.52 శాతం ఓట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.
ఆర్థిక స్థిరత్వం, ఉపాధి, మౌలిక సదుపాయాల ఆధునీకరణ తదితర హామీలతో అధికారంలోకి వచ్చిన రమాఫొసా ఆరేళ్లలో అనేక ఎత్తుపల్లాలు చూశారు. డి-డాలరైజేషన్‌ను వ్యతిరేకించడం, గాజాలో ఇజ్రాయిల్‌ యుద్ధ నేరాలను వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె)లో పోరాడటం, రష్యా, చైనాలతో మైత్రిని పెంపొందించు కుంటూ శ్వేతజాతి దురహంకారానికి వ్యతిరేకంగా ఎఎన్‌సి తీసుకున్న దృఢమైన వైఖరి అంతర్జాతీయంగా ఆ దేశ ప్రతిష్టను పెంచింది. అయితే, దేశీయంగా శ్వేతజాతీయుల ఆర్థిక పెత్తనం ద్రవ్యోల్బణం 9.3 శాతానికి, పేదరికం 62 శాతానికి పెరగడం, తాగునీరు, విద్యుత్‌ కొరత వంటివి ఇబ్బందికరంగా మారాయి.
ప్రస్తుతానికి అందరి దృష్టి దేశంలో ఏం జరుగుతుందనే దానిపైనే ఉంది. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా ప్రయోజనాలను పరిరక్షించగలిగే సత్తా కలిగిన శక్తిగా ఎఎన్‌సి ఇప్పటికీ ఉన్నది. దక్షిణాఫ్రిక్రా ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం, మిత్రులను కలుపుకునిపోవడంపై ఎఎన్‌సి ప్రధానంగా దృష్టి సారించాలి. దక్షిణాఫ్రికాను పీడిస్తున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు సాగాలి.

➡️