తాగునీటి అవస్థలుకోసం..

ప్రజాశక్తి-హుకుంపేట:ఏజెన్సీలో నీటి కష్టాలు గిరిజనులను వెంటాడుతున్నాయి. కొండ కోనలు దాటి సుదూర ప్రాంతాల్లో నుంచి తాగునీటికి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడింది. ఊట బావుల్లో లభ్యమవుతున్న బురద నీటిని సేకరించాల్సి వస్తుంది. ఫలితంగా వ్యాధుల బారిన పడుతున్నామని గిరిజనులు వాపోతున్నారు. మండలంలోని పాతకోట పంచాయతీ డి.చింతలవీధి గ్రామస్తులు తీవ్ర తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో గ్రామానికి సురక్షిత తాగునీటిని అందిస్తామని నేతలు ఇచ్చిన హామీలు ఐదేళ్లు గడిచినా అమలుకు నోచుకోక పోవడంతో కలుషిత ఊట నీటితోనే గ్రామస్తులు దప్పిక తీర్చు కోవల సిన దుస్థితి నెలకొంది. ఈ గ్రామంలో 70 నివాశాలు ఉండగా సుమారు 120మంది జనాభా ఉంది. గ్రామంలో తాగునీటి సౌకర్యం లేదు. సాయిరాం సేవా ట్రస్ట్‌ నిర్వాహకులు స్పందించి తాగునీటి ట్యాంకు, కుళాయిలు ఏర్పాటు చేశారు. కొంత కాలం పాటు తాగునీరు సరఫరా అయ్యింది. అయితే తర్వాత ఊటగెడ్డలోని ట్యాంకులో ఇంకి పోయి తాగునీటి ట్యాంకుకు నీరు సరఫరా కాలేదు. దీంతో కుళాయిలకు తాగునీరు సరఫరా కాలేదు. నీరు లేక గ్రామంలో ట్యాంకు, కొళాయిలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. గత్యంతరం లేక గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఊరు శివారున ఉన్న కలుషిత ఊట నీటిని సేకరిస్తున్నారు. ఊటనీరు బురదతో నిండినా అదే నీటిని ఉపయోగించాల్సి రావడంతో వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు.ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు గడిచినా తాగునీటి పథకము నిర్మాణానికి ఒక్క అడుగు పడలేదు. వేసవి నేపథ్యంలోనూ అధికారులు పథకం ఏర్పాటుకు దృష్టి సారించ లేదు. కనీసం గ్రామంలో బోరు బావి ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకోలేదని గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు.

➡️