.ఊట గెడ్డల నీరే దిక్కు!

Apr 16,2024 23:56
ఊట గెడ్డలో నీటిని తోడుతున్న మహిళలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ఏజెన్సీ ప్రాంతంలోని మారు మూల గిరిజన గ్రామాల్లో సురక్షిత తాగునీరు కల్పిస్తున్నట్లు గత, ప్రస్తుత ప్రభుత్వాలు గొప్పలు చెప్పాయి తప్ప ఆచరణలో అమలు కాలేదు. అనేక మారుమూల పివిటిజి గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించక పోవడంతో గిరిజనులు సమీప పొలాల్లోని ఊట, పెదగెడ్డలు శరణ్యంగా మారాయి. కలుషితమైన నీటిని తాగడంతో గిరిజనులు పలు రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు.మండలంలోని కురిడి పంచాయతీ బలియాగుడ, గొందిగుడ పివిటిజి గ్రామాల్లో ఇప్పటివరకు తాగునీటి సౌకర్యం కల్పించ లేదు. బలియాగూడ మారుమూల పివిటిజి గ్రామంలో సుమారు 40 కుటుంబాలు ఉండగా, గొందిగూడ గ్రామంలో సుమారు 30 పివిటిజి కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఇప్పటివరకు తాగునీటి బోరు, గ్రావిటీ, బావిలు నిర్మించలేదు. దీంతో పివిటిజిలు గ్రామానికి సమీపంలోని పొలంలోని ఊట గెడ్డలను ఆశ్రయించి కలుషిత తాగునీటిని ఉపయోగిస్తున్నారు. బలియాగూడ గ్రామంలోని పొలంలోని ఊట గెడ్డ నుంచి వచ్చే నీటిని పివిటిజిలు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత కారణంగా ఊట నీరు ఇంకిపోతోంది. దీంతో, పొలాల్లో గోతులు తవ్వి అందులో నుంచి వచ్చే నీటిని ఉపయోగిం చుకుంటూ దాహార్తిని తీర్చుకుంటున్నారు. గోందిగూడ గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించక పోవడంతో ఆ గ్రామానికి సమీపంలోని పొలంలోని ఊట గెడ్డను ఆశ్రయించి తాగునీటిని ఉపయోగిస్తున్నారు. ఊటగెడ్డల నీరు కలుషితంగా ఉండటంతో ఆయా గ్రామాల్లోని గిరిజనులు టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, కడుపునొప్పి వంటి వ్యాధులకు గురవుతున్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండల తీవ్రతకు ఊటగెడ్డ నీరు కూడా ఇంకి పోతుండటంతో గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా చర్యలు తీసుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత, ప్రస్తుత పాలక ప్రభుత్వాలు తాగునీటి సమస్యపై దృష్టి సారించ లేదు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో గ్రావిటీ పథకం నిర్మించి సురక్షితమైన తాగునీరు అందించాలని ఆదిమ జాతి గిరిజనులు కోరుతున్నారు.

➡️