గిరిజనులకు ‘చింత’

Apr 11,2024 00:25
చింతపండు ను ఆటోలో తరలిస్తున్న వ్యాపారులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:గిరిజనులు పండించి సేకరిం చిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి గిరిజనులకు ఆర్థికంగా ఆసరా కల్పించడానికి ప్రభుత్వం జిసిసిని ఏర్పాటు చేసింది. అయితే జిసిసి చింతపండును కొనుగోలు చేయక పోవడంతో వారపు సంతల్లో దళారులు చొరబడి తక్కువ రేట్లకు అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటు తూకంలో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో, గిరిజనులు ఆర్థికంగా నష్టపోతున్నారు.మండలంలో ప్రస్తుతం చింతపండు కాపు కాయడంతో గిరిజనులు చింతపండును సేకరించి విక్రయాలు చేస్తున్నారు. జిసిసి చింతపండును కొనుగోలు చేయక పోవడంతో గిరిజనులు వారపు సంతలకు తరలించి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం జిసిసి ద్వారా ప్రకటించిన ధరలకన్నా తక్కువ ధరతో దళారులు వ్యాపారస్తులు కొనుగోలు చేయడంతో పాటు తూకాల్లో కూడా మోసలు చేస్తుండడంతో గిరిజనులు ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జిసిసి నుంచి చింతపండు కిలో రూ .38 లు ధర ప్రకటించింది. కానీ సంతల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మండలంలోని బుధవారం జరిగిన కించుమండ వారపు సంతలో జిసిసి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక పోవడంతో మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారస్తులు, దళారులు కిలో రూ.30లకు కొనుగోలు చేసి ప్రైవేట్‌ వాహనాల్లో మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. గిరిజనులు ఎంతో కష్టపడి సేకరించిన చింతపండుకు కనీస ధర గిట్టుబాటు కాక పోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. జిసిసి అధికారులు దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయక పోవడంతో దళారులు, మైదాన ప్రాంత వ్యాపారస్తులు సంతల్లో చింతపండును కొనుగోలు చేసి లాభాలకు అమ్ముకుంటున్నారు. తక్షణమే జిసిసి అధికారులు స్పందించి చింతపండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని గిరిజనులు, ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

➡️