దశాబ్దాల పాలనలో తీరని దాహం

Apr 23,2024 21:20

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 77 ఏళ్లు గడుస్తున్నా పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ముఖ్యంగా గిరి శిఖర గ్రామాల్లో గిరిజనులు నేటికీ దుర్భర జీవనం గడుపుతున్నారు. తాగడానికి కనీసం స్వచ్ఛమైన నీటి చుక్క లేని దుస్థితి. నీటి కోసం కిలోమీటర్ల దూరం కొండలు దిగి కిందకు వచ్చి దాహార్తి తీర్చుకుంటున్న సందర్భాలు ఏజెన్సీలో నిత్య కృత్యం కనిపిస్తూనే ఉంటాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో చలములు, కొండవాగు ఊటనీరుపై ఆధారపడి కలుషిత నీటిని తాగడంతో వ్యాధులు బారిన పడుతున్నారు. దశాబ్దాల పాటు అధికారం వెలగబెట్టిన పాలకులు ఏజెన్సీలో తాగునీటి కష్టాలను తీర్చలేకపోతు న్నారు. దీంతో గిరిజనులకు ఏటా చలమలే దిక్కవుతున్నాయి. ఫలితంగా మండు వేసవిలో మన్యంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి.

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: గత ఎన్నికల్లో గిరిజనుల కష్టాలు తీరుస్తామని అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం గిరిజన సమస్యలను పట్టించుకోవడం మానేసింది. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కేవలం ఓట్లు కోసమే వస్తున్నారు తప్ప గిరిజనుల కష్టాలు తెలుసుకొనే పరిస్థితిలో లేకపోవడం బాధాకరం. మన్యం జిల్లాలో పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో ఎనిమిది సబ్‌ ప్లాన్‌ మండలాల్లో 1,503 గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిలో 4,160 బోర్లు, 745 రక్షిత నీటి పథకాలు, 5 సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు, 123 సోలార్‌ పంపుసెట్లు ఇలా 974 గ్రామాల్లో పూర్తి స్థాయిలో నీటి వనరులున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ వేసవి వచ్చే సరికి వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ ఏడాది వర్షాలు కురవక ఇప్పటికే గ్రామాల్లో బోర్లు, బావులు పూర్తిగా ఎండిపోయాయి. సోలార్‌ పంపుసెంట్లు, రక్షిత మంచినీటి పథకాలు పని చేయడం మానేశాయి. బోర్లు కూడా అడుగంటిపోయినవి కొన్నైతే, మరమ్మతులతో మూలకు చేరినవే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. దీంతో గిరిజనులకు తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పటిలాగే చలమలు, కొండలోయల్లో ఊటలపైనే ఆధారపడుతున్నారు. ఇప్పటికే నీటికోసం దూర ప్రాంతాలకు కాలినడకన వెళ్లి బిందెలతో మోసుకొస్తున్నారు. గుమ్మక్ష్మీపురం మండలం జోగిపురం గ్రామం ఏర్పాటై 40 ఏళ్లు గడిచింది. ఇక్కడ 52 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తాగునీటి బోరుల నిర్మాణం జరగలేదు. దీంతో గ్రామంలో ఉన్న ఒకే ఒక బావిపై ఆధారపడుతున్నారు. చప్పగూడ, శిఖర పాయి, వనకాబడి గ్రామాల్లో గిరిజనులు తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. కురుపాం మండలం తోలుంగుడలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ రెండు బోర్లు తీశారు. అవి పూర్తిగా ఎండిపోవడంతో గ్రామ సమీపాన ఉన్న ఊటనీటి చుట్టూ కుండీ కట్టుకుని అందులో ఊట నీటిని తాగుతున్నారు. వర్షాలు లేక అది కూడా ఎండిపోవడంతో గ్రామానికి తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జి.శివడ, ఒబ్బంగి, తిత్తిరి, జరడ, పొడి పంచాయతీల్లో కొండలపై ఉన్న గ్రామాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉంది. కొమరాడ మండలం చోళ్లపథం పంచాయతీ రెబ్బలో 30గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఒక్క మంచినీటి బోరు కూడా లేదు. దీంతో ఊరికి దూరంగా ఉన్న గెడ్డలో గోతులు తీసుకుని, అందులో ఊరిన నీటిని పట్టుకుని తాగుతున్నారు. ఆ గెడ్డ నీటికి రెండు కిలోమీటర్ల దూరంలో వెళ్లాల్సి వస్తోంది. ఇటీవల వర్షాలు లేక గెడ్డ కూడా పారడం మానేసింది. దీంతో గెడ్డలో ఎక్కడ గొయ్యి తవ్వినా ఊట రావడంలేదు. దీంతో గ్రామస్తులకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వేసవికి ముందే ఈ పరిస్థితి రావడంతో ఆందోళన చెబుతున్నారు. ఇలా ఈ మండలంలో కుంతేసు, గుర్లమ్మ, ఊసనందితో పాటు మరో నాలుగు పంచాయతీల్లో గిరిజనం తాగునీటికి కటకటలాడుతున్నారు. గుమ్మలక్ష్మీపురం 10 పంచాయతీల్లో, జియ్యమ్మవలస, కొమరాడ చెరో ఎనిమిది, సాలూరు, మక్కువల్లో ఆరు చొప్పున పంచాయతీల్లోని గిరిశిఖర గ్రామాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. టిడిపి హయాంలో పంచాయతీరాజ్‌శాఖా మంత్రి నారాలోకేష్‌ కురుపాం, ఎస్‌.కోట నియోజకవర్గాల్లో రెండు తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయమై సెప్టెంబర్‌ 24న 11, 49 నెంబర్లతో జీవోలు విడుదల చేశారు. రూ.190 కోట్లతో ఎస్‌.కోట పథకాన్ని, రూ.110కోట్లతో కురుపాం పథకాన్ని చేపట్టనున్నట్టు ఆయా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంటివన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్‌ తాగునీటి సరఫరా సంస్థ (ఎపిడబ్ల్యుఎస్‌సి) ద్వారా రూ.5,330కోట్లు కేటాయించింది. కానీ, నెలరోజుల తర్వాత ఈ జీవోలో పేర్కొన్న కురుపాం ప్రాజెక్టు కనిపించలేదు. ఇవే నెంబర్లతో సెప్టెంబర్‌ 26న విడుదల చేసిన కొత్త ఉత్తర్వులో కురుపాం బదులు గజపతినగరం మండలం గంట్యాడ, చీపురుపల్లి ప్రాజెక్టులు ఉండడం గమనార్హం. దీనిబట్టి గిరిజనులపై వారు ఎంత ప్రేమ చూపుతున్నారో అర్థమవుతోంది. ఏజెన్సీ ప్రాజెక్టును మైదానానికి మార్పుచేసి కురుపాం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.110కోట్లలో రూ.80.71కోట్లు గంట్యాడ ప్రాజెక్టుకు, రూ.29.29కోట్ల చీపురుపల్లి ప్రాజెక్టుకు ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఈ పథకాల ద్వారా గంట్యాడ మండల కేంద్రంతోపాటు కొన్ని గ్రామాలు, చీపురుపల్లితోపాటు 45 గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరుతాయని అధికారులు చెబుతున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన కురుపాం నియోజకవర్గానికి మంజూరుచేసిన పథకాన్ని మైదాన ప్రాంతంలోని టిడిపి నాయకులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు మళ్లించడం పట్ల తీవ్ర విమర్శలు రేకెత్తాయి. ప్రస్తుతం వైసిపి కూడా అదే ధోరణి కొనసాగిస్తుందని మన్యం ప్రజలు మండిపడుతున్నారు.

➡️