అంతర్‌రాష్ట్ర దొంగ అరెస్టు

నిందితుని వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌

       అనంతపురం క్రైం : ఐదు రాష్ట్రాల్లో సుమారు 80కి పైగా దొంగతనం, దోపిడీ కేసులు ఉన్న అంతర్‌ రాష్ట్ర దొంగను అనంత పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.15 లక్షల విలువజేసే 23 తులాల బంగారు, 2 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ బుధవారం నాడు విలేకరులకు వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్‌ జిల్లా పండరీపురం నౌరంగిఆశ్రమంకు చెందిన అశోక్‌కులకర్ణి రాత్రి పూట తాళం వేసిన ఇళ్లలో తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతుండేవాడు. అనంతపురం, గుంతకల్లు, ఆలూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, మహరాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో సుమారు 80కి పైగా దొంగతనాల కేసులు ఇతనిపై ఉన్నాయి. కర్నాటకలోని మూడు కేసుల్లో శిక్షలు కూడా అనుభవించాడు. ఇతనిపై వారంట్లు పెండింగులో ఉన్నాయి. ఇటీవలే జైలు నుంచి బయటికొచ్చి మళ్లీ పాత పంథా కొనసాగించాడు. ఈక్రమంలోనే అనంతపురం, గుంతకల్లు, ఆలూరులలో చోరీలు చేశాడు. ఇతనిపై నిఘా ఉంచడంతో పక్కాగా అందని సమాచారం మేరకు అనంతపురం డీఎస్పీ ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో మూడవ పట్టణ సిఐ కె.ధరణి కిషోర్‌, సిసిఎస్‌ సిఐ జిటి.నాయుడు, గుంతకల్లు వన్‌టౌన్‌ సిఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐలు గోపాలుడు, నాగరాజుల ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీధర్‌, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు ఫరూక్‌, రంజిత్‌, బాలకష్ణ, దాస్‌లు బందంగా ఏర్పడి అనంతపురం నగరంలోని రైల్వే స్టేషన్‌ వద్ద గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఐదు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడిన ఈయన్ను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

➡️