అడుగంటిన జలం.. ఎండుతున్న పొలం..!

నీరు లేక ఎండిపోయిన వేరుశనగ పంట

        గార్లదిన్నె : ఆరుగాలం శ్రమించే అన్నదాతను కష్టాలు వీడడం లేదు. ప్రతి ఏడాది ఏదో రూపంలో పంటలు చేతికందక నష్టాలను తెచ్చిపెడుతూనే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు రాకపోవడంతో విత్తనాలు కూడా వేయని పరిస్థితి నెలకొంది. బోరుబావుల కింద పంటలు సాగు చేద్దామంటే భూగర్భ జలాలు అడుగంటి ఆ పరిస్థితి కూడా లేకుండా పోతోంది. గార్లదిన్నె మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం సాగునీటి కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. మండల పరిధిలోని ముకుందాపురం, జమ్ములదిన్నె, కణంపల్లి తదితర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు బావుల్లో నీరు రావడం లేదు. దీంతో రైతులు సాగు చేసిన చీని లాంటి పండ్లతోటలతో పాటు వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు అనధికార కరెంటు కోతలు అన్నదాతలకు మరింత కష్టాలను తెచ్చిపెడుతోంది. లక్షలు అప్పు చేసి సాగు చేసిన పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో రైతులు ఎవరికి చెప్పాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రతి సంవత్సరం వర్షాలతో పాటు మిడ్‌ పెన్నార్‌ రిజర్వాయర్‌ నుంచి జమ్ములదిన్నె చెరువుకు నీరు వచ్చేవి. ఈ సంవత్సరం అరకొర నీరు వచ్చాయి. నీటి లభ్యత తక్కువ కావడంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడింది. జమ్ములదిన్నె గ్రామంలో సర్వే నెంబర్‌ 36లో రైతు కడంచు నాగేశ్వరరావు రబీలో 9.4 ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంట బోరుబావుల్లో నీరులేకపోవడంతో ఎండిపోయింది. ఇలాంటి రైతులు అనేక మంది పంటలను కోల్పోయిన తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

కళ్లేదుటే పంట ఎండిపోతోంది…

రైతు నాగేశ్వరరావు, జమ్ములదిన్నె గ్రామం.

        లక్షలాది రూపాయలు అప్పులు చేసి బోర్లు వేయించాను. పంట సాగుకు అప్పులు చేశాను. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పంట ఎండిపోతోంది. అదనంగా నీటి కోసం బోరు వేయించినా నీరు పడలేదు. కళ్లేదుటే పంట ఎండిపోతున్నా ఎమీ చేయలని పరిస్థితి ఉంది. పంట నష్టపరిహారంపై మండల వ్యవసాయ అధికారులను అడిగ ఇతే గార్లదిన్నె మండలానికి ఇన్పుట్‌ సబ్సిడీ రాలేదని చెబుతున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటకే ఇంకా ఇన్సూరెన్స్‌ రాలేదు. ఇలాంటి పరిస్థితిల్లో రైతులు జీవనం కష్టాల మయం అయ్యింది.

➡️