అన్ని విధాలా ఎన్నికలకు సన్నద్ధం : కలెక్టర్‌ ఎం.గౌతమి

అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

            అనంతపురం : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలా సన్నద్ధం అవుతున్నట్లు కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం సాయంత్రం సాధారణ ఎన్నికలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాలా సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. నామినేషన్‌ స్వీకరణకు పది రోజుల ముందు వరకు ఫామ్‌-6 దరఖాస్తులను తీసుకోవచ్చన్నారు.కొత్తగా ఓటు హక్కు నమోదు అవుతున్న వారు, ఎక్కడా ఓటు లేని వారి దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఈనెల 19వ తేదీ నాటికి 19,98,841 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఫామ్‌-6 దరఖాస్తుల పరిశీలన అనంతరం ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 2,213 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 23 సహాయక పోలింగ్‌ కేంద్రాలతో కలిపి మొత్తం 2,236కి పోలింగ్‌ కేంద్రాలు చేరుకున్నాయన్నారు. గత ఎన్నికల్లో 90 శాతం కన్నా ఎక్కువగా ఓటింగ్‌ జరిగిన, మైనస్‌ 10 శాతం కన్నా తక్కువగా పోలింగ్‌ జరిగిన, లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు తలెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లాలో 1,032 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లను గుర్తించామన్నారు. ఏప్రిల్‌ 12వ తేదీన ఈవీఎం మొదటి రాండమైజేషన్‌, మే ఒకటో తేదీన ఈవీఎం రెండవ రాండమైజేషన్‌ ప్రక్రియను చేపడతామన్నారు. ఇందుకు సంబంధించి పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి 10వ తేదీ లోపు పూర్తి చేస్తామని తెలిపారు. వాలంటీర్లు రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. వాలంటీర్లు రాజకీయ పార్టీలతో కలిసి పాల్గొంటే తమ దష్టికి తీసుకువస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950, జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు 08554-231722, 08554-231922, 08554-232922కు తెలపవన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు క్యాంపెయిన్‌, ర్యాలీకి సంబంధించి, వెహికల్‌, లౌడ్‌ స్పీకర్‌, స్కూల్‌ గ్రౌండ్‌, ఫ్లాగ్స్‌, బైక్‌ ర్యాలీకి సంబంధించి అనుమతి కోసం సువిధ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల పాల్గొన్నారు.

➡️