‘ఆయనొక్కడు…అసంతృప్తులు ఐదుగురు..!

            అనంతపురం ప్రతినిధి : అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఒకవైపు అయితే ..ఐదుగురు అసమ్మతి నేతలు ఇంకో వైపు అన్నట్టు ఉంది. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం టిక్కెట్టు అధికారికంగా ఖరారు కాకపోవడంతో టిక్కెట్టు ఆశిస్తున్న వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అనంత వెంకటరామిరెడ్డికి టిక్కెట్టు ఖరారైనట్టు ప్రచారం నడుస్తోంది. అసమ్మతి నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. రెండు రోజలుగా అక్కడే మకాం వేసి తమలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలోనూ ఆయన ఒకవైపు, ఐదుగురు నేతలు ఒకవైపు ఉండి ప్రయత్నాలు సాగించారు. అధిష్టానం అనంత వెంకటరామిరెడ్డి వైపు మొగ్గు చూపింది. ఈసారి మార్పు చేపడితే తమకు అవకాశం కల్పించాలని చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాసులు, వైటి.శివారెడ్డి, నదీమ్‌ అహమ్మద్‌, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డిలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అటు మైనార్టీ, ఇటు బలిజ సామాజిక తరగతులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నందు వీరికి అవకాశం కల్పించాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే అనంత వెంకటరామిరెడ్డి మాత్రం పార్టీలో తనకున్న పట్టుతో సైలెంట్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుతో సాధించే పనిలోనున్నారు. అంతేకాకుండా ఈ ఐదేళ్లలో నగరంలో ప్రధాన రహదారులను పూర్తి చేయడం, అభివృద్ధి చేసి చూపించానని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా మద్దతు కూడా గట్టే పని కూడా చేస్తున్నారు. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు, తాను చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం నగర పాలక సంస్థ పాలక వర్గంలో పట్టుపెంచుకున్నారు. తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని మేయరుగా అయ్యేటట్టు చేసుకోవడంలో ఆయన సఫలీకృతమయ్యారు. అసమ్మతి నేతలు ఆ పదవి కోసం పోటీపడినా వారికి కాకుండా తాను అనుకున్న వ్యక్తినేే మేయరుగా చేసుకున్నారు. దీంతో నగరంలో ఎక్కడా ఎటువంటి సమస్యలేకుండా తానుకున్న విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగారన్న చర్చ నడుస్తోంది. సీనియర్‌ నాయకుడిగానూ అనంత వెంకటరామిరెడ్డి పేరుంది. 1996 నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటూ వస్తున్నారు. ప్రారంభంలో ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉంటూ వచ్చారు. 2019లోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో జిల్లా రాజకీయాల్లో ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఆయనకు టిక్కెట్టు మార్పు ఉండబోదని ఆ పార్టీ నేతలు సైతం చెబుతున్నారు. ఈయనకు కొంత అసమ్మతిని ముందు నుంచి ఎదుర్కొంటూ వస్తునే ఉన్నారు. ఆ ఐదుగురు నేతలు ఈసారైనా మార్పు చేపట్టి తమలో ఎవరికో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే అధిష్టానం ఈ మార్పునకు అంగీకరిస్తుందా లేక అనంత వెంకటరామిరెడ్డికే మరోమారు అవకాశం కల్పిస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. అసమ్మతి నేతలు మాత్రం రెండు రోజులుగా రాజధానిలోనే మకాం వేసి మార్పు చేపట్టాలని గట్టిగా పట్టుబడుతున్నారు.

➡️