ఈనాంకు సున్నం..!

అనంతపురం మార్కెట్‌యార్డులో అమ్మకానికి వచ్చిన చీనీ కాయలు

   అనంతపురం ప్రతినిధి : రైతులకు మేలు చేస్తామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల కొనుగోలుకు తీసుకొచ్చిన ఈనాం పద్ధతికి వ్యాపారులు, అధికారులు కలసి సున్నం పెట్టారు. ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచి అయినా పంట కొనడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఈ పద్ధతిని 2016లో కేంద్రంలోని బిజెపి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం వ్యాపారుల పాలిట వరంగా మారిందని చెప్పవచ్చు. గతంలో వేలంలో ఒకరిద్దరు వ్యాపారులైనా పోటీ పడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఈనామ్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు, బయటి వ్యక్తులెవరూ కొనుగోలుకు రాకుండా ఇక్కడున్న వ్యాపారులే మేనేజ్‌ చేస్తూ రైతులను నిలువునా ముంచేస్తున్నారు. స్థానిక వ్యాపారులు నిర్ణయించేందే ధర అవుతోంది.

పది లక్షల టన్నులకు 12 మంది వ్యాపారులు

          ఉమ్మడి అనంతపురం జిల్లాలో 42,490 హెక్టార్లలో చీనీపంట ఉంది. ఏడాదికి రాష్ట్రంలోనే అత్యధికంగా దిగుబడి అనంతపురం జిల్లాలోనే వస్తుంది. ఇక్కడ ఏడాదికి సగటున పది లక్షల టన్నుల దిగుబడి చీని పంట వస్తుంది. ఇంత పెద్దఎత్తున పంట వచ్చే ఈ జిల్లాలో ఉన్న చీనీ మార్కెట్‌ అనంతపురం వ్యవసాయ మార్కెట్‌ ఒక్కటే. ఇక్కడ చూస్తే కేవలం 12 మంది వ్యాపారులు మాత్రమే మార్కెట్‌ శాఖ వద్ద రిజిస్టర్‌ అయ్యి ఉన్నారు. వీరు నిర్ణయించినదే ధరగా అమలు జరుగుతోంది. ఉత్తరాది వ్యాపారులు వచ్చినా నేరుగా కొనుగోలు చేయడానికి వీల్లేని పరిస్థితులున్నాయి. ఈ వ్యాపారుల వద్ద నుంచే కొనుగోలు చేసుకుని వెళ్తుండటం ఆనవాయితీగా మారింది. ఉన్న అతికొద్ది మంది వ్యాపారులు సిండికేట్‌ అవడంతో వారు నిర్ణయించినదే ధరగా మారుతోంది. కొత్త వ్యాపారులను రప్పించి కొనుగోళ్లు పెంచే విధంగా చూడాల్సిన మార్కెటింగ్‌ శాఖ మౌనంగా ఉంటూ అది తమ బాధ్యత కాదన్నట్టుగా ఉండటం గమనార్హం.

పనిచేయని సైన్‌ బోర్డు

        ఈనాం పద్ధతిలో వ్యాపారం మొదలయ్యాక దేశంలో ఏ మార్కెట్‌లో చీనీ ధర ఎంతకు పోతోందన్నది ఎప్పటికప్పుడు సైన్‌బోర్డులో డిస్‌ప్లే అవుతూ ఉండాలి. కానీ అనంత మార్కెట్‌లో అలా జరగడం లేదు. గత సీజన్‌ నుంచి అది పనిచేయకుండా ఉంది. అధికారులు ఈ విషయాన్ని కూడా గుర్తించకపోవడం గమనార్హం. ఈ అంశంపై కార్యదర్శి జయలక్ష్మిని వివరణ కోరగా పనిచేస్తోందని చెప్పారు. పని చేయడం లేదని చెప్పగా ఆమె కింది స్థాయి ఉద్యోగినిని అడిగారు. కింది స్థాయి ఉద్యోగి పనిచేయడం లేదని చెప్పగా తన దృష్టికి తీసుకురావాలి కదా అని సదరు ఉద్యోగికి చెప్పడం గమనార్హం.

ఇక్కడేమో ఈనాం..పులివెందులలో వేలం..!

           అనంతపురం మార్కెట్‌లో ఈనాం పద్ధతి కాకుండా వేలం ద్వారా చీనీ పంట కొనుగోళ్లు చేపట్టాలని రైతులు అడుగుతుంటే… అది ప్రభుత్వ నిర్ణయమని మార్కెటింగ్‌ శాఖ అధ్యక్షులు ఫయాజ్‌ బాషా, కార్యదర్శి జయలక్ష్మి చెబుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల్లో వేలం పద్ధతిలోనే కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇదే విధానాన్ని ఇక్కడా అమలు జరపని రైతులు అడుగుతుంటే మాత్రం నిబంధనలు అంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారు. వేలంలో అయితే రైతుకు పంట ఏ ధరకు అమ్ముడుపోతోందన్న విషయం అయినా తెలిసే అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఈనాం పద్ధతిలో ఎంతకు అమ్ముడుపోయిందన్న వివరాలు కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు శాతం కమీషన్‌ అయితే పది శాతం వసూళ్లు..!

          వ్యవసాయ మార్కెట్‌లో నాలుగు శాతం మాత్రమే కమీషన్‌ తీసుకోవాలని నిబంధనలున్నాయి. ఈ నిబంధనలను అధికారుల కళ్లేదుటే యధేచ్ఛగా వ్యాపారులు ఉల్లంఘించి పది శాతం వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు రైతులు మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ ఫయాజ్‌ బాషా, కార్యదర్శి జయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ఎవరూ ఇప్పటి వరకు ఫిర్యాదు ఇవ్వలేదు కాబట్టి చర్యలు తీసుకోలేదని. ఎవరైనా ఇస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలపడం కొసమెరుపు. ఓవైపు రైతులు తమకు నష్టం జరుగుతోదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా మార్కెట్‌యార్డు అధికారులు పట్టించుకోకుండా నిబంధనల సాకు చూపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

➡️