ఉత్సవ విగ్రహాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం నాయకులు

       అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్ల అధికారాలు, హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరించి వారిని ఉత్సవ విగ్రహాల్లా మార్చేసిందని ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర అధ్యక్షులు వైవిబి. రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టర్‌ కార్యాలయం ముందు బుధవారం నాడు ఉమ్మడి జిల్లాకు చెందిన సర్పంచులు, ఎంపిటిసిల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పంచాయతీల నిధులు, సర్పంచుల అధికారాలు, విధులను హరించారన్నారు. వాటిని తిరిగి ఇవ్వమని రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్యమంలో అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు భాగస్వాములు అవుతున్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ పేర్కొన్న ”గ్రామ స్వరాజ్య” సాధన కోసం రాష్ట్రంలోని 12,918 మంది సర్పంచులు రాజకీయాలకు అతీతంగా ఐక్యమై గత రెండున్నర సంవత్సరాలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తున్నట్లు చెప్పారు. సర్పంచుల సంఘం కోరుతున్న 16 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులను విడుదల చేయకపోవడంతో గ్రామాలు, వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేక సర్పంచులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు ప్రజల చేత తీవ్ర విమర్శలకు గురవుతున్నారన్నారు. స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే కారణం అన్నారు. మళ్లీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెలు శిధిలమైపోయి, గ్రామీణ ప్రజలు నాశనం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైసిపిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు చుక్క ధనుంజయ యాదవ్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్‌, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డేగల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

➡️