ఎన్‌హెచ్‌.544 భూ బాధితులకు న్యాయం చేయాలి

మందు డబ్బాలతో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న భూ బాధితులు

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం

సోములదొడ్డి నుంచి అమరావతి వరకూ వెళ్లే రహదారి 544 భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని బాధిత రైతులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మంగళవారం మండల కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలోని బోడిగానిదొడ్డి గ్రామంలో పొలం సర్వే నంబర్‌ 112-2లో 47 మంది ఇళ్లు కోల్పోతున్నామన్నారు. అయితే గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే గతంలో నిర్ణయించిన మేరకు ఇవ్వకుండా పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తమకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పరిహారం చెల్లించాలని, లేకుంటే తమ తొలగింపును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇందుకు స్పందించిన తహశీల్దార్‌ రమాదేవి పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బాధితులు ఎం.రాజగోపాల్‌, ఆర్‌.నాగరాజు, వి.కృష్ణ, వి.వేణుగోపాల్‌, వి.సత్యనారాయణ, పాలు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

➡️