కనికరం కరువు..!

అంజలి పల్లలు, భర్తతో మాట్లాడుతున్న ఐసిడిఎస్‌ అధికారి

అనంతపురం ప్రతినిధి : అనంతపురం నగరంలోని కలెక్టరేట్‌ ఎదుట ఒక గర్బిణి ఆకలి చావుతో ఆదివారం నాడు మరణించింది. ఈ హృదయ విదారక ఘటన మనస్సున్న ప్రతి ఒక్కరినీ చలించివేసింది. అయితే అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం కన్పించలేదు. బాధిత కుటుంబం ఇప్పటికీ కలెక్టరేట్‌ ఎదుటనున్న విన్సెంట్‌ ఫెర్రర్‌ విగ్రహం ఎదుటే ఉంటోంది. మృతిరాలి భర్త రాజు ఎప్పటిలాగానే పూటుగా తాగిపడిపోయి ఉండగా, పిల్లలు అఖిల (14), చరణ్‌(12), సాయి(10)కు నానమ్మ బిక్షాటన చేసి తీసుకొచ్చిన తిండే సోమవారం కూడా ఆహారమైంది. ఉదయం నుంచి వారి స్థితిగతులు తెలుసుకున్న అధికారులెవరూ లేరు. సాయంత్రానికి మాత్రం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆఫీసరు చంద్రకళ వచ్చారు. ఆమె మృతురాలి భర్త రాజుతో మాట్లాడారు. బాలికను బాల సదనంలో చేరుస్తామని ఇద్దరు మగపిల్లలను వసతి గృహంలో చేరుస్తామని చెప్పారు. తాగిన మైకంలోనున్న రాజు దానికి కూడా అంగీకరించే పరిస్థితి కనిపించలేదు.

నానమ్మ బిక్షాటనతోనే పిల్లలకు ఆహారం

అకలితో మరణించిన అంజలి పిల్లలకు నాన్నమ్మ తులసమ్మ అనంతపురం నగరంలో బిక్షాటన చేసి ఆహారం పెడుతోంది. సోమవారం నాడు కూడా ముగ్గురు పిల్లలు బిక్షాటన చేసి తీసుకొచ్చిన ఆహారంతోనే కడుపనింపుకున్నారు. అది లేకుంటే పిల్లలు కూడా పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. ముగ్గురు పిల్లల చదువులు కూడా మధ్యలోనే ఆగాయి. అఖిల ఆరవ తరగతి వరకు చదువుకుని చదువు మానేసింది. ఇద్దరు మగపిల్లలు బడి మెట్లు ఎక్కిన దాఖలాలు లేవు. ఈ పిల్లలకు ఆధార్‌కార్డు కూడా ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం.

హాస్టల్‌లో చేరుస్తాం

చంద్రకళ, ఐసిడిఎస్‌ అధికారిణి.

మరణించిన అంజిలి ముగ్గురు పిల్లలను హాస్టల్‌లో చేర్చి మంచి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్‌ అధికారిణి చంద్రకళ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆమె విన్సెంట్‌ ఫెర్రర్‌ విగ్రహం వద్ద ఉన్న అంజలి పిల్లలు, భర్తతో మాట్లాడారు. అంజలి కూతురు అఖిలను వెంటనే బాలసదనంకు తీసుకెళ్తామన్నారు. ఇద్దరు మగపిల్లలను ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పిస్తామన్నారు. మంగళవారం నాడు వారిని తీసుకెళ్లే ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.

➡️