కమణీయం.. చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం

కమణీయం.. చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం

చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-ఉరవకొండ

ప్రసిద్ధిచెందిన గవిమఠం స్థిత చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం మంగళవారం వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండువగా సాగింది. ఇందులో భాగంగా మేజర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రథం అలంకరణకు పూలను స్థానిక కార్యాలయం నుంచి పురవీధుల గుండా మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం గవిమఠం పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్ర మహాస్వాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై కొలువు తీర్చారు. సంప్రదాయబద్దంగా, శాస్త్రక్తంగా పూజలు చేసిన అనంతరం అశేష జనవాహిని చేసిన శివనామస్మరణ మధ్య చంద్రమౌళీశ్వరస్వామి రథోత్సవం కమనీయంగా సాగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి రథంపై పూలు, పండ్లు విసిరి తమ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం ముందు మఠం ఏనుగు ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో చంద్రమౌళీశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నుంచి కాకుండా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. కాగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, వైసిపి సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మధుసూదన్‌రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని మఠం అధికారులు చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవిమఠం ఉత్తరాధికారి బసవ రాజేంద్రస్వామి, ఆదోని చౌకీమట్టం పీఠాధిపతి కళ్యాణిస్వామి, గవిమఠం అసిస్టెంట్‌ కమిషనర్‌ చిట్టెమ్మ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️