గవర్నర్‌ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు : కలెక్టర్‌

Jan 3,2024 22:37

గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

        అనంతపురం : రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 6వ తేదీన రాష్ట్ర గవర్నర్‌ జెఎన్‌టియు స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రానున్నారు. ఇందుకు సంబంధించిన జెఎన్‌టియులో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6వ తేదీన జెఎన్‌టియులో గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్‌ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎక్కడా అపరిశుభ్రం లేకుండా చూడాలన్నారు. జెఎన్‌టియు ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు నెలకుని ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఆడిటోరియంలో సీటింగ్‌ ఏర్పాట్లు, వచ్చిన వారికి తాగునీరు సరఫరా, తదితర ఏర్పాట్లు సకాలంలో చేపట్టాలన్నారు. గవర్నర్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడే ఉన్న గెస్ట్‌హౌస్‌లో కూడా అన్ని ఏర్పాట్లు వెంటనే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు గ్రంధి వెంకటేష్‌, సి.శ్రీనివాసులురెడ్డి, జెఎన్‌టియు ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, రిజిస్ట్రార్‌ శశిధర్‌, డైరెక్టర్‌ విశాల, తహశీల్దార్‌ బాలకిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️