తెలంగాణ ప్రభావం రాష్ట్రంపై ఉండదు..

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి ఉషశ్రీచరణ్‌

ప్రజాశక్తి-రాయదుర్గం

ఇటీవల వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై ఏమాత్రం ఉండదని మంత్రి ఉషశ్రీచరణ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి చేయాలన్న దృఢ సంకల్పంతో సిఎం జగన్‌ ముందుకెళ్తున్నారన్నారు. ప్రజలు ఏ సచివాలయానికి వెళ్లినా అక్కడ పనితీరును బట్టి పరిస్థితిని అంచనా వేయవచ్చన్నారు. ఈనేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి టిడిపి నాయకులు ఓర్వలేక తమ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఇది రాబోయే రోజుల్లో వారికి తీవ్రమైన నష్టం, పతనం కలిగిస్తుందన్నారు. మంత్రి జయరాం మాట్లాడుతూ తాను గతంలో అసెంబ్లీలో వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశానన్నారు. అందుకే అప్పట్లో కాలవ శ్రీనివాసులకు మంత్రి పదవి దక్కిందన్నారు. ఈ విషయం ఆయన గ్రహించాలన్నారు. జిల్లాలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అనేక పదవులను ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారి అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు.

➡️