నేరప్రవృత్తితో జీవితాలు నాశనం : ఎస్పీ

నేరప్రవృత్తితో జీవితాలు నాశనం : ఎస్పీ

షికారీ కాలనీలోని పిల్లలతో మాట్లాడుతున్న ఎస్సీ అన్బురాజన్‌

          అనంతపురం క్రైం : నేర ప్రవత్తితో జీవితాలు నాశనం అవుతాయని, దానిని విడనాడి పరివర్తన దిశగా వెళితే అన్ని విధాలా మేలు జరుగుతుందని ఎస్పీ కెకెఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీసుశాఖ, ఆర్డీటీ, దాతల సహకారంతో అనంతపురంలోని షికారీ కాలనీలో విద్య, వైద్యం, ఆరోగ్యం మెరుగుదల కోరుతూ మంగళవారం నాడు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆర్డీటీ మహిళా సాధికారత విభాగం డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. షికారీ కాలనీకి చెందిన 80 మంది పిల్లలకు సోప్స్‌, బ్రష్‌, ఫేస్టు, బట్టల సోపులు, ఆయిల్‌ కలిగిన కిట్లను పంపిణీ చేశారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. దాతల సహకారంతో 135 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జత దుస్తులు, స్వెట్టర్లు అందజేశారు. రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలోని మాంటిస్సోరి ఫౌండర్‌ భరత్‌ తన వంతుగా కాలనీ విద్యార్థులకు 2 కంప్యూటర్లు, 1 ప్రొజెక్టర్‌ అందజేశారు. కాలనీలో కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆపరేషన్లు మీనాక్షమ్మ ఐ ఛారిటబుల్‌ ట్రస్టు తరుపున చేయిస్తామని ఆ సంస్థ నిర్వాహకుడు రమణ హామీ ఇచ్చారు. రాప్తాడు ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో కాలనీలోని 20 కుటుంబాలకు 6 నెలల సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ షికారీ పిల్లలకు ఏదైనా విద్య, తదితరాల అభివద్ధి సహకారం కోసం జిల్లా పోలీసుశాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలియజేశారు. ఆర్డీటీ మహిళా సాధికారత విభాగం డైరెక్టర్‌ విశాల ఫెర్రర్‌ మాట్లాడుతూ షికారీ కాలనీ వాసులు, వారి పిల్లల అభివద్ధికి తమతో పాటు తోడ్పడుతున్న దాతలకు అభినందనలు తెలియజేశారు. సమిష్టిగా తోడ్పడితేనే అభివద్ధి సాధ్యమవుతుందన్నారు. పిల్లలు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్‌ డీఎస్పీ బివి.శివారెడ్డి, అనంతపురం డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి, ఆర్డీటీ డైరెక్టర్లు రాజశేఖర్‌ రెడ్డి, రఫీ, వన్‌టౌన్‌ సిఐ రెడ్డెప్ప, డీసీఆర్బీ సిఐ విశ్వనాథచౌదరి, దాతలు తాడిపత్రి రవి ప్రకాష్‌, బాబ్జాన్‌, భరత్‌, రమణ, కిరణ్‌ పాల్గొన్నారు.

➡️