నేరాన్ని అ’దృశ్యం’ చేయాలనుకుని..!

నేరాన్ని అ'దృశ్యం' చేయాలనుకుని..!

పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

       అనంతపురం క్రైం : ఇద్దరూ కలిసి చేసిన వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. ఇందులో ఒకరిది తప్పంటే ఒకరిది తప్పంటూ నిందించుకున్నారు. ఈ క్రమంలో ఒకరు మరొకరిని తప్పిస్తే అప్పులు చెల్లించాల్సిన అవసరం ఉండదని పథకం రచించాడు. అనుకున్న విధంగానే మిత్రున్ని హత్య చేశాడు. ఇది బయటకు తెలియనివ్వకుండా దృశ్యం సినిమాను తలపించే విధంగా కథను అల్లాడు. అయితే పోలీసులు తీగలాగడంతో డొంక కదిలింది. హత్య చేసింది మిత్రుడే అని గుర్తించి అతన్ని కటకటాల వెనక్కి పంపారు. నాలుగు రోజుల క్రితం అనంతపురంలో తీవ్ర సంచలనం రేపిన యువకుని మిస్సింగ్‌, హత్య కేసును అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు ఛేధించారు. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన 11 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఉదయం పోలీసు కాన్ఫిరెన్స్‌హాల్లో ఎస్పీ అన్బురాజన్‌ విలేకరులకు వెల్లడించారు. గత నెల 27వ తేదీన అనంతపురం నగరం మున్నానగర్‌కు చెందిన మహమ్మద్‌ ఆలీ బెంగళూరుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని అతని తండ్రి వన్‌టౌన్‌ పోలీసులకు ఈనెల 1వ తేదీన ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో సిఐ వి.రెడ్డెప్ప, ఎస్‌ఐలు సుధాకర్‌ యాదవ్‌, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎఎస్‌ఐ నాగేశ్వరరెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు భాస్కర్‌, ఫరూక్‌, అశ్వర్థ, కానిస్టేబుళ్లు మహమ్మద్‌, ఆసిఫ్‌, దాసు, మురళీ, మోహన్‌ అమీర్‌లు బందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఇందులో అనుమానితునిగా ఉన్న మహమ్మద్‌ ఆలీ స్నేహితుడు మహమ్మద్‌ రఫీక్‌ను అనంతపురం వినాయకనగర్‌లోని సిద్ధిక్‌ ఫర్నీచర్‌ దుకాణం వద్ద అరెస్టు చేసి, అతన్ని విచారించారు. తొలుత నేరంతో తనకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించినా పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు మొత్తం బయటకు వచ్చాయి. ధర్మవరం ప్రాంతానికి చెందిన సుఫారీ గ్యాంగ్‌తో కలసి మహమ్మద్‌ అలీని చంపి కాల్చేసినట్లు చెప్పాడు. ఈ మేరకు ప్రధాన నిందితుడు షేక్‌ మహమ్మద్‌ రఫీ, షేక్‌ కరిష్మా, షేక్‌ గౌసియా, షేక్‌ సిద్దిక్‌ అలీ, గుజ్జల శివ కుమార్‌, గుజ్జల చంద్రశేఖర్‌, గుజ్జల హరి, గుజ్జల కష్ణ, మంగళ కేసన్నగారి రాము, షాహీనా, కరణం శ్రీనివాస్‌ ఫణిలను అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక కారు, రెండు మోటార్‌ సైకిళ్లు, ల్యాప్‌టాప్‌, 5 మొబైల్‌ ఫోన్లు, రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకన్నారు.

అప్పులను తీర్చలేక హత్య

       నిందితుడు షేక్‌ మహమ్మద్‌ రఫీ, హత్యకు గురైన మహమ్మద్‌ అలీ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి పలు వ్యాపారాలు చేశారు. ఈ వ్యాపారాల్లో నష్టం వచ్చింది. ఇందుకు కారణం నీవంటే నీవేనంటూ ఒకరిపై ఒకరు నెట్టుకోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వ్యాపారాల్లో నష్టపోయిన డబ్బును చెల్లించాలని మహ్మద్‌ఆలీ తరుచూ అడిగేవాడు. దీనికితోడు ఇతను తరుచూ మహమ్మద్‌ రఫీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో ప్రవర్తించే తీరు షేక్‌ మహమ్మద్‌ రఫీకి సరిపోయేది కాదు. ఈ క్రమంలో మహ్మద్‌ఆలీని చంపేస్తే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని భావించాడు. అనుకున్నదే తడువుగా ధర్మవరం సుఫారీ గ్యాంగ్‌తో సంప్రదించాడు. అందులో భాగంగా గత నెల 27వ తేదీన మహమ్మద్‌ అలీని తన భావ అయిన షేక్‌ సిద్ధిక్‌ అలీకి చెందిన ఫర్నీచర్‌ గోడౌన్‌కు పిలిపించి అక్కడ బాగా కొట్టారు. ఈ దెబ్బలు తాళలేక మహ్మద్‌ ఆలీ మరణించాడు.

దృశ్యం సినిమాను తలపించేలా నేరాన్ని మార్చేసే కుట్ర

  1.          హత్య అనంతరం ప్రధాన నిందితుడు షేక్‌ మహ్మద్‌ రఫీ దానినుంచి తప్పించుకునేందుకు దృశ్యం సినిమా తరహా కథను అల్లే ప్రయత్నం చేశాడు. హత్య అనంతరం మృతదేహాన్ని నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి మాయం చేసే ప్రయత్నం చేశాడు. మహమ్మద్‌ అలీ శవాన్ని కారులో తీసికెళ్లి కారు సహా గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పడేయాలని భావించాడు. అలా చేయడం వీలుకాకపోవడంతో తిరిగి మృతదేహాన్ని అంబులెన్స్‌లో అనంతపురంలోని నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో మహమ్మద్‌ రఫీక్‌ నిర్మిస్తున్న కొత్త ఇంటికి తీసుకెళ్లారు. గత నెల 28వ తేదీ అర్ధరాత్రి దాటాక మృతదేహాన్ని నారాయణపురం సమీపంలోని శ్మశాన వాటికకు తీసికెళ్లి పెట్రోలు పోసి ఆనవాళ్లు లేకుండా కాల్చివేశారు. అనంతరం ఏమీ తెలియని వాళ్లలా ఇంటికి వచ్చారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెళ్లడికావడంతో ప్రధాన నిందితునితో పాటు సహకరించిన 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా యువకుడి మిస్సింగ్‌, హత్యేను ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
➡️