పది రోజులైనా తగ్గని పొగ కాలుష్యం

పది రోజులైనా తగ్గని పొగ కాలుష్యం

కంపోస్టు యార్డు నుంచి ఉధృతంగా వస్తున్న పొగ

ప్రజాశక్తి-రాయదుర్గం

పట్టణ పొలిమేరలోని కంపోస్టు యార్డులో చెత్తకు నిప్పంటుకోవడంతో దాదాపు 10 రోజుల నుంచి విపరీతంగా పొగ వస్తోంది. దీంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు ఈనెల 3న కంపోస్టు యార్డులో చెత్తకు నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది కలిసి అగ్నిమాపక దళం సాయంతో మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ చెత్త నిల్వలు భారీగా ఉండటంతో బయట మంటలు కనిపించకపోయినప్పటికీ విపరీతంగా పొగ వస్తోంది. దీంతో శాంతినగర్‌, పార్వతీనగర్‌, వాల్మీకినగర్‌ కాలనీవాసులతోపాటు బళ్లారి రోడ్డు మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు పొగ కాలుష్యానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటుగా వెళ్లే సమయంలో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ను వివరణ కోగా మరోసారి చెత్తను చదును చేసి పొగ, మంటలను పూర్తిగా ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

➡️