చీనీ రైతులను ఆదుకోకుండి : రైతుసంఘం

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందిస్తున్న రైతుసంఘం నాయకులు

         అనంతపురం కలెక్టరేట్‌ : పంట సాగు చేసి ఈనామ్‌, కమీషన్‌ తదితర వాటి ద్వారా నష్టపోతున్న చీనీ రైతులను ఆదుకోవాలని ఎపి రైతుసంఘం నాయకులు కోరారు. అనంతపురం చీని మార్కెట్‌ యార్డులో ఈనామ్‌ వ్యవస్థ రద్దు చేసి, పులివెందుల మార్కెట్‌ యార్డు మాదిరిగా వేలం పాట ద్వారా అమ్మకాలు జరపాలని, మార్కెట్‌ నిబంధనల ప్రకారం నాలుగు శాతం కమిషన్‌ వసూలు చేయాలని కోరుతూ రైతుసంఘం నాయకులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు బుధవారం నాడు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, పండ్లతోటల రైతుసంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 42,490 ఎకరాల్లో 10,62,260 టన్నులు చీని పంటను రైతులు పండిస్తున్నారన్నారు. పాలకులు రైతుల పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్ల దళారుల చేతుల్లో రైతులు నలిగిపోతున్నారన్నారు. రైతులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈనామ్‌ విధానంలో రైతుల కంటే వ్యాపారస్తులకే ఎక్కువ ప్రయోజనం ఉందన్నారు. రైతులు నష్టపోకుండ చీని కాయలు మార్కెట్‌లో ఈనామ్‌ రద్దు చేసి వేలం పాట ద్వార అమ్మకాలు జరపాలన్నారు. తోటల్లో సూట్‌ తీసుకునే విధానం రద్దు చేసి సూటు (టన్నుకు 200 కిలోలు అదనంగా) చీనీ కాయలు కొనే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న కమీషన్‌ 10 శాతం నుండి 4 శాతంకు తగ్గించాలన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల చీనీ కొనుగోలు నిమిత్తం వచ్చే వ్యాపారస్తులను రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. పులివెందుల మార్కెట్‌ కమిటీ మాదిరి వేలం పాటల నిర్వహించి రైతులను ఆదుకోవాలన్నారు. పెరుగుతున్న పండ్లతోటలకు అనుగుణంగా షెడ్లు నిర్మాణం, కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో చీని పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈకార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షులు తరిమెల నాగరాజు, బి.చంద్రశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

➡️