పోలీసులు సీజ్‌ చేసిన నగదు

తాడిపత్రిలో రూ.1.31కోట్ల నగదు సీజ్‌

            తాడిపత్రి : ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.31 కోట్ల నగదును అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సిఎం గంగయ్య సోమవారం ఉదయం విలేకరులకు వెల్లడించారు. తాడిపత్రి పట్ణణంలో శనివారం రాత్రి కొందరు డబ్బు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులకు అందింది. దీంతో తాడిపత్రి డీఎస్పీ సిఎం గంగయ్య ఆధ్వర్యంలో సిఐలు మురళీకృష్ణ, లక్ష్మికాంతరెడ్డిలు పోలీసులు, సెబ్‌ అధికారులతో కలిసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తాడిపత్రి బస్టాండు వద్ద తాడిపత్రి పట్టణం మెయిన్‌ రోడ్డుకు చెందిన షేక్‌ మస్తాన్‌ వలీ, షేక్‌ నజీమున్నీషా, షేక్‌ రషీదాల వద్ద రూ.1,31,35,750 నగదు లభించింది. దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలూ చూపకపోవడంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. నగదు తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారి ఇంట్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిన నగదును ఐటి అధికారులకు అప్పగించారు. కాగా పట్టుబడిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు కేరళ, మహరాష్ట్ర, తదితర ప్రాంతాలలో బంగారు కొనుగోలు చేసి తాడిపత్రిలో అధిక ధరలకు విక్రయిస్తుంటారని పోలీసులు తెలియజేశారు.

➡️