మండుతున్న మిర్చి రైతు..!

మూడు రోజుల క్రితం పంటలకు నీరివ్వాలని విడపనకల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

       అనంతపురం ప్రతినిధి : పంటకు నీరివ్వాలని కోరుతూ అనంతపురం జిల్లా మిర్చి రైతులు గడిచిన రెండు రోజులుగా మండుతున్నారు. సాగునీరు అందివ్వాలంటూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. వీరికి విపక్షాలు పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నాయి. పంట కీలక దశలో ఆరుతడి ఇవ్వకపోతే దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగానే సాగునీరు జనవరి వరకు వస్తుందని భావించి రైతులు పంటలు సాగు చేశారు. ఈసారి సాగునీరు కాలువలకు ముందుగానే నిలిపేశారు. దీంతో పెట్టిన పంటలు ఎండిపోయే దశకు వస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యామ్నాయం ద్వారానైనా నీటిని అందివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

62,751 ఎకరాల్లో మిర్చి

  అనంతపురం జిల్లాలో విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, పెద్దవడుగూరు మండలాల్లో ప్రధానంగా మిర్చి పంట సాగవుతుంది. ఇందులో గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌, హెచ్‌ఎల్‌ఎంసి, ఎంపిఆర్‌ నార్త్‌ కెనాల్‌ కింద ఈ పంటలు సాగవుతాయి. ఈ ప్రాంతాల్లో ఈ ఏడాది 62,751 ఎకరాల్లో మిర్చి పంట సాగైంది. ఒక్కో ఎకరానికి సగటున రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. బాగా పంట వస్తే ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. పంట మొత్తం జనవరి ఆఖరు నాటికి కోతకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఈ నెలా, జనవరి ఆఖరు వరకు మిర్చికి ఆరుతడి ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవడంతో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నవంబర్‌కే నీటి విడుదల ఆగిపోయింది. గుంతకల్లు సబ్‌ బ్రాంచ్‌ కెనాల్‌కు నీరు ఆగింది. ఇక హంద్రీనీవా ద్వారానైనా నీరొస్తుందనుకుంటే ఆదీ ఆగిపోయింది. రెండు వైపులా నీరు ఆగిపోవడంతో ఈ కాలువల కింద సాగైన మిర్చి రైతుకు ఇబ్బందులు తప్పడం లేదు.

కౌలు రైతులే అధికం

       మిర్చి పంట సాగు చేసిన వారిలో అత్యధికంగా కౌలు రైతులే ఉన్నారు. వజ్రకరూరు మండల పరిధిలో ఒక ఎకరం పొలమున్న రైతు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంటను సాగు చేశాడు. ఎకరానికి రూ.50 వేల వరకు ముందస్తు గుత్త చెల్లించి మరీ సాగు చేశాడు. పెట్టుబడులు కూడా భారీగానే వచ్చాయి. ఇప్పుడు సాగునీరు లేక పంట పోతే రైతు భారీగా నష్టపోనున్నాడు. ఇలాంటి రైతులు అనేక మంది ఉన్నారు. అందుకే రైతులు నీరిచ్చి పంటను కాపాడాలని కోరుతూ ఆందోళన బాట పట్టారు.

సమస్య పట్టనట్టు పాలకులు

     సాగునీటి సమస్య ఉత్పన్నమవుతుందని ముందు నుంచే సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇంత వరకు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించిన దాఖలాలు కనిపించడం లేదు. రోడ్డుపైకొచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నా, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మిర్చి రైతుల్లో అత్యధికులు

కౌలు రైతులే బాల రంగయ్య. ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి.

 మిర్చి రైతుల్లో అత్యధిక మంది కౌలు రైతులే ఉన్నారు. ఎకరానికి రూ.50 వేలు ముందస్తుగా కౌలు చెల్లించాలి. తరువాత పెట్టుబడి అత్యధికంగా ఉంటుంది. ఒక్కో రైతు ఎకరానికి రెండు లక్షల రూపాయల వరకు ఫెట్టుబడి పెట్టారు. రైతులకు ప్రభుత్వం సాగునీరు అందివ్వకపోవడం వలన నష్టపోతున్నారు.వెంటనే సాగునీరిచ్చి రైతులను ఆదుకోవాలి.

➡️