మాదక ద్రవ్యాలను నిషేధించాలి

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న మహిళలు

         అనంతపురం కలెక్టరేట్‌ : సమాజానికి ప్రమాదకరంగా తయారైన మాదక ద్రవ్యాలను నిషేధించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి డిమాండ్‌ చేశారు. మాదక ద్రవ్యాలను నిషేధించి యువత, సమాజాన్ని కాపాడాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లో మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వి.సావిత్రి మాట్లాడుతూ మాదకద్రవ్యాల మత్తులో యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ సమాజానికి హాని కలిగిస్తున్నారని తెలిపారు. స్కూల్‌ స్థాయి నుంచే పిల్లలకు మాదకద్రవ్యాలు అందుతున్న దుస్థితి నెలకొనడం ప్రమాదంగా ఉందన్నారు. విశాఖపట్నంలో కోట్ల రూపాయల ఖరీదైన కొకైన్‌ దొరికిందంటే ప్రభుత్వాలు ఎంత మేరకు మాదకద్రవ్యాల నిషేధంపై పనిచేస్తున్నాయో తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి డ్రగ్స్‌ వెనకాల ఎవరూ ఉన్నారో తేల్చాలన్నారు. సిబిఐ సమగ్ర విచారణ జరిపి నిందితులన కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. మాదక ద్రవ్యాల పట్ల ప్రభావితం కాకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు సాయిలక్ష్మి, జిల్లా అధ్యక్షులు శ్యామల, నాయకులు జ్యోతి, రామానుజులమ్మ, రేణుక, గీత, రేవతి పాల్గొన్నారు.

➡️