వడదెబ్బపై అప్రమత్తత అవసరం

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

         అనంతపురం కలెక్టరేట్‌ : ఎండ ఎక్కువ కావడంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సూచించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వడగాలులు (హీట్‌ వేవ్‌)పై సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం ఉదయం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవికాలంలో వడగాలులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల పరిధిలో వడగాలుల సందర్భంగా తీసుకోవాల్సిన యాక్షన్‌ ప్రణాళికను సిద్ధం చేసి, ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా చికిత్సల కోసం అన్ని వసతులను సిద్ధం చేసుకోవాలన్నారు. అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అన్ని చోట్లా వేసవి సీజన్‌ ముగిసే వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటికి సంబంధించి జిల్లాలో ఎక్కడా సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు అవసరమైన చోట ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ మేఘస్వరూప్‌, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ ఆర్డీ పీవీఎస్‌ఎన్‌.మూర్తి, డిపిఒ ప్రభాకర్‌ రావు, ఎస్‌డిసి ఆనంద్‌, డీఎంహెచోవో డా||ఈబి.దేవి తదితరులు పాల్గొన్నారు.

➡️