వేతనాలు చెల్లించేంత వరకూ ఉద్యమం

వేతనాలు చెల్లించేంత వరకూ ఉద్యమం

అధికారులతో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు

ప్రజాశక్తి-కళ్యాణదుర్గం

శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించేంత వరకూ ఉద్యమం ఆగదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు హెచ్చరించారు. వేతనాలు చెల్లించాలని కోరుతూ స్థానిక పంప్‌హౌస్‌ వద్ద కార్మికులు రెండు రోజులుగా చేపట్టిన సమ్మెకు ఓబులు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు. నిరవధిక సమ్మె చేపట్టినా ప్రభుత్వానికి సిగ్గు లేదన్నారు. హక్కుగా రావాల్సిన వేతనాలను చెల్లించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాత్రి, పగలు కష్టపడుతున్న కార్మికులకు వేతనాలు అందించకపోతే కుటుంబాలు ఎలా గడవాలని నిలదీశారు. కార్మికుల సమ్మె కారణంగా నీటి సరఫరా కాకపోతే ప్రజలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుందనే విషయం తెలిసినప్పటికీ ఉన్నతస్థాయి అధికారుల్లో చలనం లేకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని విమర్శించారు. వేసిన దృష్టిలో పెట్టుకుని అటు కాంట్రాక్టర్‌, ఇటు పాలకులు వెంటనే స్పందించి కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

➡️