వేలంపాట ద్వారా చీనీ పంట విక్రయాలు సాగాలి

వేలంపాట ద్వారా చీనీ పంట విక్రయాలు సాగాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

అనంతపురం మార్కెట్‌ యార్డులో చీనీ పంటను వేలంపాట ద్వారా విక్రయాలు సాగాలని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం సంఘం జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ చీనీ పంట కొనుగోలులో సూట్‌ విధానం అరికట్టాలన్నారు. కమిషన్‌ను 4 శాతానికి తగ్గించాలన్నారు. జిల్లాలో సుమారు 42,490 ఎకారాల్లో 10,62,260 టన్నుల చీనీపంటను పండిస్తున్నారన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల, పెరిగిన పెట్రోల్‌ డీజిల్‌ ధరలతో ఎరువులు, పురుగు మందులు, చీడపురుగులు ప్రకృతి వైపరీత్యాలను రైతులు చీనీపంటను పండిస్తున్నారన్నారు. అయితే పాలకులు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్ల దళారుల చేతుల్లో రైతులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటను మార్కెట్‌కు తెచ్చిన రైతుకు సరైన ధర రావడం లేదన్నారు. మార్కెట్‌లో మొదటి రకం చీనీపంటకు టన్నుకు రూ.25 వేలు అమ్ముడుపోతోందన్నారు. అది కూడా గాలివాటంగా ఉందన్నారు. రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈనాం విధానంలో రైతుల కంటే కొనుగోలు దారులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతోందన్నారు. వ్యాపారులు సిండికేట్‌ అయ్యి రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. మార్కెట్‌కు చీనీ పంటను తెచ్చినప్పటి నుంచి ‘దినదిన గండం నూరేళ్లు ఆయుష్సు’ అన్నట్లు వ్యాపారుల దయపై రైతు రాత తయారైందన్నారు. కావున రైతులు నష్టపోకుండ చీనీకాయలు మార్కెట్‌లో ఈనామ్‌ రద్దు చేసి వేలం పాట ద్వార అమ్మకాలు జరిపి సూట్‌ తీసుకునే విధానం రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పండ్ల తోటల రైతుసంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి, రైతుసంఘం నాయకులు విరూపాక్షి, రాజారామిరెడ్డి, పోతలయ్య, రెడ్డిపల్లి శ్రీనివాసులు, రాముడు, రమేష్‌, బి.చంద్రశేఖర్‌రెడ్డి, గాండ్ల శివారెడ్డి, మల్లికార్జున, వెంకటకొండ, తదితరులు పాల్గొన్నారు.

➡️