మోసం, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ‘బాబు’

మోసం, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ 'బాబు'

ఓటర్లను అభ్యర్థిస్తన్న విశ్వేశ్వరెడ్డి

ప్రజాశక్తి-వజ్రకరూరు

మోసం, వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ టిడిపి అధినేత చంద్రబాబు అని వైసిపి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వై.విశ్వేశ్వరరెడ్డి, శంకరనారాయణ విమర్శించారు. శుక్రవారం వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మెయిన్‌ రోడ్డుతోపాటు గ్రామంల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము లేని చంద్రబాబు బిజెపి, జనసేనను కలుపుకుని ప్రజల వద్దకు వస్తున్నారన్నారు. అంతేగాకుండా అమలు చేయలేని అనేక హామీలు గుప్పిస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో 650కిపైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత ఒక్క హమీని కూడా అమలు చేయకుండా మోసం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు ప్రజలను పీల్చుకుతింటే, జగన్‌ అధికారంలోకి వచ్చాక అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా ఇళ్లకే సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రస్తుతం కూడా అమలుకు సాధ్యమయ్యే హామీలను మేనిఫెస్టోలో చేర్చారన్నారు. చంద్రబాబు లాగా దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే వ్యక్తి జగన్‌ కాదన్నారు. కాగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు కనిపిస్తారన్నారు.కరోనా సమయంలో నియోజవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌, విజయవాడకే పరిమితమయ్యారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తికి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తనను గెలిపిస్తే కొనకొండ్ల గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.60 లక్షలు తాగునీటి కోసం కేటాయించామని, అవసరమైతే జడ్పీ నిధులతో శాశ్వత పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు. దీంతోపాటు గ్రామంలో అర్హత ఉండి ఇంటి స్థలం లేని వారికి కూడా ఇంటిస్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజవర్గంలో దాదాపు రూ.2500 కోట్లతో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చామని వివరించారు. కావున వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.అలాగే విడపనకల్లు మండల పరిధిలోని ఎన్‌.తిమ్మాపురం గ్రామంలో ఎంపిపి కరణం పుష్పావతి భీమిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సుశీల ఉమాశంకర్‌, ఎంపిటిసి ఓబులేష్‌, నాయకులు కరణం భీమిరెడ్డి, ధనుంజయరెడ్డి, శివారెడ్డి, హంపయ్య, ప్రసాద్‌, అశోక్‌రెడ్డి, మేకల భీమన్న, మాధవరెడ్డి, సురేష్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్లుగా ప్రజాసేవ లక్ష్యంగా పని చేస్తున్న మీ అభిమాన నాయకులు, తమ నాన్న వైసిపి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని యువనేత వై.ప్రణరురెడ్డి అభ్యర్థించారు. శుక్రవారం ఉరవకొండలోని 12, 13వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

➡️