మోస్తరు వర్షం

May 25,2024 23:41
  • ఈదురుగాలులకు నేలవాటిన తోటలు
  •  పిడుగుపాటుకు రెండు గేదెలు మృతి

ప్రజాశక్తి- యంత్రాంగం :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం నుంచి వాన మొదలైంది. పలుచోట్ల మోస్తరు వర్షం కురవగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అరటి, మొక్కజొన్న చెట్లు నెలకూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈరురుగాలులతో కూడిన వర్షానికి అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు, సూరేపల్లి, సంజీవపురం, ఓబులాపురం తదితర గ్రామాల్లో అరటి, మొక్కజొన్న తోటలు నెలకూలాయి. దాదాపు వంద ఎకరాలకుపైగా పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ఈదురు గాలులకు నేలమట్టం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపప్పూరు మండలం సింగనకుంటపల్లి గ్రామంలో పిడుగుపాటుకు రైతు నారాయణస్వామికి చెందిన రెండు పాడి గేదెలు మృతి చెందాయి. రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎన్‌టిఆర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలో 13.42 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. పిఎన్‌ బస్‌స్టేషన్‌, కాళేశ్వరరావు మార్కెట్‌, విఎంసి సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం ప్లైఓవర్‌ వద్ద నీరు నిలిచిపోయింది. హౌసింగ్‌ బోర్డు కాలనీ, కబేళా, విజయా డైరీ సెంటర్‌, చిట్టినగర్‌, మ్యాంగో మార్కెట్‌, సింగ్‌నగర్‌ వాంబే కాలనీ, కండ్రిక, ఆర్‌ఆర్‌పేట, బీసెంట్‌ రోడ్డు, పాలీక్లీనిక్‌ రోడ్డు, బెంజి సర్కిల్‌ నుంచి ఎన్‌టిఆర్‌ సర్కిల్‌, ఎపిఐఐసి కాలనీ, రామలింగేశ్వర్‌నగర్‌, బ్రమరాంభపురం తదితర ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా తయారైన డ్రెయినేజీ కారణంగా రహదారులపై నీరు పెద్ద ఎత్తున నిల్చిపోయింది. ఈ నీటిని మోటార్‌ ఇంజన్లతో బయటకు తరలించే ప్రక్రియను విఎంసి ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగం అధికారులు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో భారీ వర్షం కురిసింది. విడవకుండా చిరుజల్లులతో ముసురు వాతావరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం,రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, ఆలమూరులో చెదురుమదురు జల్లులు పడ్డాయి. యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రపు అలలు ఎగసి పడుతున్నాయి. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి, యు.కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మండలంలో మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిన ప్రజలు శనివారం వాతావరణం చల్లబడడంతో సేద తీరారు.

➡️