ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌గా మారుద్దాం : మంత్రి

సమావేశంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

           అనంతపురం కలెక్టరేట్‌ : అక్షర క్రమంలో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్ది దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం నాడు కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌ కుమార్‌, వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌తో కలిసి రాష్ట్రస్థాయి డయేరియా నివారణ క్యాంపెయిన్‌ను అనంతపురం కలెక్టరేట్‌లో నిర్వహించారు. రెవెన్యూ భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్యకుమార్‌ సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. వైద్యుల కనబడే ప్రత్యక్ష దేవుళ్లుగా ప్రజలందరూ భావిస్తారన్నారు. వైద్యరంగం నేడు కొంత మసకబారిందనడంలో అంగికరించక తప్పదన్నారు. వైద్యులుగా సమాజానికి అందే సేవలు వెలకట్టలేనిదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రత్యక్ష దేవుళ్లు వైద్యులే అన్నారు. వైద్య రంగంలో ఉన్న లోపాలన్ని సరి చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సమిష్టిగా పని చేద్దామన్నారు. ప్రస్తుతం డయేరియా వ్యాధి ప్రబలి ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో దాని నివారణకు వైద్య సిబ్బంది సమిష్టిగా సమన్వయంతో సేవలు అందించాలన్నారు. డయేరియాతో ఒక్క ప్రాణం కూడా కోల్పోవడానికి వీలు లేదన్నారు. ముందస్తుగా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఓఆర్‌ఎస్‌, జింక్‌ మాత్రలు విరివిగా ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంపుదల చేసి మెరుగైన సేవలు అందిద్దామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డయేరియా క్యాంపెయిలో భాగంగా జూలై 1 నుంచి ఆగస్ట్‌ 31వ తేదీ వరకు అతిసార నియంత్రణ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయి స్టాప్‌ డయేరియా క్యాంపెయిన్‌ పోస్టర్‌లను మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. డాక్టర్స్‌ డే సందర్భంగా మంత్రి కేక్‌ కట్‌ చేసి వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, జెడ్పీ సిఇఒ వైఖోమ్‌ నిదియా దేవి, డిఆర్‌ఒ జి.రామకృష్ణారెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఈబి.దేవి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పాల్‌ రవికుమార్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మాణిక్యరావు, ఆసుపత్రి సూపరిన్‌టెండెంట్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

➡️